అణు పరీక్షలు ఆపేస్తున్నాం
– మా అణుపరీక్ష ప్రాంతాన్ని మూసేస్తున్నాం
– త్వరలో ట్రంప్‌తో సమావేశం నేపథ్యంలో కిమ్ కీలక నిర్ణయం
– కిమ్ నిర్ణయాన్ని స్వాగతించిన ట్రంప్
– ఇది చాలా పెద్దపురోగతి అని ట్వీట్ చేసిన ట్రంప్
సియోల్,ఏప్రిల్21(జనంసాక్షి): అణుపరీక్షలతో ప్రపంచ దేశాలను వణికించిన ఉత్తర కొరియా సంచలన నిర్ణయం తీసుకుంది. అణు పరీక్షలను, లాంగ్ రేంజ్ క్షిపణి పరీక్షలను నిలిపేస్తున్నామని ప్రకటించింది. అలాగే తమ అణు పరీక్ష ప్రాంతాన్ని మూసేస్తున్నామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. శత్రుదేశం అమెరికాతో అణు ప్రయోగాలపై చర్చలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌లు సమావేశమయ్యేందుకు ఇరు దేశాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
అణ్వస్త్రాలను నిలిపేయాలని అమెరికా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య జరుగుతున్న చర్చల నేపథ్యంలో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అణుపరీక్షలను నిలిపేస్తున్నట్లు చెప్పిన ఉత్తర కొరియా ఇప్పటికే ఉన్న అణు ఆయుధసంపత్తి గురించి ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. కిమ్ అణు పరీక్షలను నిలిపేయడానికి అంగీకరించినప్పటికీ.. ఆయుధ సంపత్తిని తగ్గించేందుకు ఒప్పుకోకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
కిమ్ నిర్ణయాన్ని స్వాగతించిన ట్రంప్..
ఉత్తర కొరియా అణు ప్రయోగాలు నిలిపేస్తున్నట్లు చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది ఉత్తర కొరియాకు, ప్రపంచానికి చాలా మంచి వార్త అని ట్వీట్ చేశారు. ఇది చాలా పెద్ద పురోగతి అని అన్నారు. కిమ్‌తో సమావేశం కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. మే లేదా జూన్‌లో ట్రంప్, కిమ్‌ల సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతున్నందున తమ దేశంపై అధికంగా ఉన్న ఆంక్షలను తొలగించుకోవాలని ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ భావిస్తున్నారని ద.కొరియా, అమెరికా అధికారులు అంటున్నారు. అలాగే ఉ.కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. ఉ.కొరియా దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా శ్రద్ధ చూపాలనుకుంటోందని పేర్కొంది.