‘అత్యున్నత’ తీర్పు
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ పక్షాన నిలిచి మరో అత్యున్నత తీర్పునిచ్చింది. రాష్ట్రంలో మెడికల్ సీట్ల కేటాయింపు విషయంలో చారిత్రక తెలంగాణ వివక్షకు గురైందని తన తీర్పుతో చెప్పకనే చెప్పింది. ఇందులో భాగంగా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలో ఒక్కోదానికి 50 సీట్ల చొప్పున మొత్తం 100 సీట్లు పెంచాలని ఆదేశించింది. హై కోర్టు తీర్పు మొన్నటి వరకు తెలంగాణలో సీమాంధ్ర కంటే ఎక్కువ మెడికల్ సీట్లు ఉన్నాయని ప్రగల్భాలు పలికిన బెజవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లాంటి వారికి కచ్చితంగా చెంప పెట్టు. ఈ తీర్పు విన్నాక తెలంగాణ ప్రజాప్రతినిధుల చేతగానితనం ఏ స్థాయిలో ఉందో ఇక్కడి ప్రజలకు అర్థమైపోయింది. ఒకవేళ తెలంగాణలో ఉండాల్సిన మెడికల్ సీట్లున్నా, అత్యున్నత న్యాయస్థానం ఆ తీర్పునిచ్చేది కాదు. తెలంగాణకు అన్యాయం జరిగిందని భావించింది కాబట్టే, తన తీర్పుతో కొంత వరకు న్యాయం చేసింది. తీర్పు వచ్చే వరకు కూడా పాలకపక్షంలో ఉన్న తెలంగాణ ప్రజాప్రతినిధులు, మెడికల్ సీట్ల కేటాయింపులో తమ ప్రాంతం వివక్షకు గురవుతున్నదని ఏనాడూ మాట్లాడలేదు. అదే తమ పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి లేదా జాతీయ స్థాయి నాయకుడిని ఎవరైనా విమర్శిస్తే ఒంటి కాలి మీద లేచేవారు. ఆ నాయకుడు ఏ ప్రాంతం వాడైనా వాళ్లకు సంబంధం లేదు. కానీ, తాము పుట్టిన తెలంగాణ ఫలానా రంగంలో అన్యాయానికి గురవుతున్నదని తెలిసినా అధిష్టానం అనుమతినిచ్చే వరకూ దానిపై స్పందించరు. వీళ్లు ఇలా ఉన్నారు కాబట్టే సీమాంధ్రలోని గోదావరి జిల్లాలు కోనసీమలయ్యాయి. నల్గొండలో ఫ్లోరోసిస్ తాండవిస్తున్నది. తెలంగాణలో నిర్మించిన నాగార్జున సాగర్ జలాలు డెల్టాకు తరలిపోతున్నాయి. మెడికల్ సీట్లు, కాలేజీల విషయంలోనూ తెలంగాణ ప్రజాప్రతినిధులు దున్నపోతు మీద వాన పడ్డ చందాన వ్యవహరించబట్టే పది జిల్లాలున్న తెలంగాణలో నాలుగు మెడికల్ కాలేజీలున్నాయి. తొమ్మిది జిల్లాలున్న ఆంధ్రలో ఆరు, నాలుగు జిల్లాలున్న రాయలసీమలో జిల్లాకో మెడికల్ కాలేజీలున్నాయి. ఎంత వ్యత్యాసం ? సీమాంధ్రలో ఉన్న కాలేజీల్లో సగానికి పైగా ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఏర్పాటైతే, తెలంగాణలో ఉన్న నాలుగు కాలేజీల్లో మూడు నిజాం హయాంలో ఏర్పాటైనవే. మిగిలిన ఒక్క కాలేజీ సీమాంధ్రలో తెలంగాణ కలిశాక ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసినా అందులో జరుగుతున్న అడ్మిషన్లు, ఉన్న వసతులు అంతంత మాత్రమే. ఈ అంకెల లెక్క చాలు తెలంగాణ ఎంతటి వివక్షను ఎదుర్కొంటున్నదో తెలియడానికి. ఈ ఇదే హై కోర్టు గ్రహించింది. అందుకే, సీట్లను పెంచాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పు చూశాకనైనా తెలంగాణ ప్రజాప్రతినిధులు కళ్లు తెరవాలి. ఆ అత్యున్నత తీర్పు ఆంతర్యమేమిటో గ్రహించాలి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలి. తెలంగాణ ఎదుర్కొంటున్న వివక్షను శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాలి.