అద్భుతాలు ఆవిష్కరిస్తాం
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : భారతదేశ యువత తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకునేందుకు తపన పడుతున్నారని..త్వరలోనే అద్భుతమైన ఆవిష్కరణలు వస్తాయని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ సౌత్‌ఇండియన్ బిజినెస్ అచీవర్స్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 200లకు పైగా కంపెనీ సీఈవోలు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ సాంకేతిక పరిజ్ఞానం, పరిపాలన అంశాలపై అభిప్రాయాలను వెల్లడించారు. పరిశ్రమల అవసరాలకనుగుణంగా శిక్షణ ఇచ్చేలా విద్యారంగంలో మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవంతమైన సాంకేతిక పరిజ్ఞానం దేశ అవసరాలకనుగుణంగా మారితేనే సార్థకమవుతుందని కంపెనీ సీఈవోలు, ప్రతినిధులకు ఆయన సూచించారు. ఇదిలాఉండగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సుర్బానా జురాంగ్ కంపెనీ సీఈవో టియోచాంగ్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో మల్టీ స్టోరేజ్ భవన నిర్మాణం చేపట్టాలని టియోచాంగ్‌ను మంత్రి కోరారు. నగరంలో విద్యుత్, నీటి సరఫరా, ట్రాఫిక్‌పై అధ్యయనం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే రాష్ట్రానికి ప్రతినిధి బృందాన్ని పంపుతామని టియోచాంగ్ కేటీఆర్‌కు చెప్పారు. ఇక సింగపూర్‌లోని ఇండస్టీయ్రల్ పార్కు, బయోపోలీస్ పార్కు, క్లీన్‌టెక్‌లను కేటీఆర్ సందర్శించారు.