అధికఫీజులు వసూలు చేస్తే చర్యలు

3

– జులై 29 నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు

– డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి

హైదరాబాద్‌,జూన్‌ 29(జనంసాక్షి):రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తరగతులు జులై 29 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. జులై 5 నుంచి 10వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశాల పక్రియ నిర్వహించి…10, 11 తేదీల్లో ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఇస్తామన్నారు. 14న విద్యార్థుల సీట్లు కేటాయించి 29 నుంచి తరగతులు ప్రారంభిస్తామని వెల్లడించారు. జులై చివరినాటికి యూనివర్శిటీలకు విసిలను నియమిస్తామని కడియం శ్రీహరి తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై కఠినచర్యలు తీసుకుంటున్నామని.. ఇప్పటికే 162 పాఠశాలలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. విద్యా సంవత్సరంలో మౌలిక వసతుల కోసం నియోజకవర్గానికి రూ.5కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,335 విద్యావాలంటీర్ల నియామకాలకు అనుమతిచ్చామని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. సచివాలయంలో కడియం విూడియాతో మాట్లాడుతూ.. విద్యావాలంటీర్ల నియామకాలకు సంబంధించి కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కొరతతో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పారదర్శకత కోసమే టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు, రెషనలైజేషన్‌ తర్వాత టీచర్ల భర్తీ జరుగుతుందన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ ఏడాది 3,500 ఇంగ్లీష్‌ విూడియం పాఠశాలలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇంటర్మీడియట్‌ విద్యను ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలకు నోటీసులు పంపామని తెలిపారు. ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఫీజులకు సంబంధించి నివేదిక పొందుపర్చాలని ఆదేశించారు. తనిఖీల సమయంలో ఫీజుల వివరాలు వెల్లడించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.