అధికారవిపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలు

వైకాపా ఎంపిల రాజీనామాల ఆమోదంతో వేడెక్కనున్న రాజకీయం

పై ఎత్తులతో విపక్షాలను చిత్తు చేసే యోచనలో చంద్రబాబు

అమరావతి,జూన్‌22(జ‌నం సాక్షి ): ఎపిలో రాజకీయ వేడి సెగపుట్టిస్తోంది. ఓ వైపు చంద్రబాబు అప్పుడే ఎన్నికల రంగంలోకి దిగగా, వైకాపా కూడా ఎన్‌ఇనకలే లక్ష్యంగా రాజకీయ కార్యాచరణతో సాగుతోంది. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఒకవైపు, లెఫ్ట్‌ పార్టీలు మరోవైపు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఇక వైకాపా ప్రత్యేక ఉద్యమ పోరాటాన్ని ఉధృతం చేయబోతోంది. జగన్‌ ఎంపిలు రాజీనామా చేయడం, ఆమోదించడం జరగడంతో ఉప ఎన్నికలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో చంద్రబాబు లక్ష్యంగా వైకాపా పోరు ఉధృతం చేయబోతోంది. ఈ దవళో లెఫ్ట్‌ పార్టీలు వరుసగా విూటింగ్‌లతో అఖిలపక్ష భేటీలు నిర్వహిస్తు న్నాయి. అందిర లక్ష్యం ఇప్పుడు చంద్రబాబును దింపడమే కావడంతో ఎవరు ఏ మేరకు రాణిస్తారన్నది ఎన్నికల తరవాత తేలనుంది. మోడీ, చంద్రబాబు ద్వయం గత సార్వత్రిక ఎన్నికలో ఇచ్చిన హావిూలు నమ్మి వారిని అందలమెక్కించిన ప్రజలకు నిరాశే మిగిల్చారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైకాపా మాత్రం తాను అధికారంలోకి రావడమే పరిష్కారం అని ప్రకటిస్తోంది. తమకే పరిస్తితులు అనుకూలంగా ఉన్నాయని, టిడిపిని ప్రజలు నమ్మడం లేదన్న ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. పాదయాత్రలో కూడా జగన్‌కు అనుకూలంగా వాతావరణం ఏర్పడుతోంది. ఏపీలో మొత్తం 25 లోక్‌ సభ స్థానాలు ఉండగా జగన్మోహన్‌ రెడ్డికి చెందిన వైసీపీకి 13 సీట్లు వస్తాయని ఓ సర్వేలో తేలింది. ఇది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని తపిస్తున్న వైసీపీకి సానుకూలపరిణామంగా మారనుంది. ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉంది. ఈ లోగా ప్రభుత్వంపై ఎంతో కొంత వ్యతిరేకత పెరుగుతుంది తప్పతగ్గదు. ఈ లెక్కన చూసుకున్నా వైసీపీకి వచ్చే ఎన్నికల్లో అనుకూల వాతావరణం ఉన్నట్లు స్పష్టం అవుతోందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అనుకూల పరిస్థితులను వైసీపీ తనకు అనుకూలంగా ఏ మేరకు మార్చుకుంటుందో వేచిచూడడాల్సిందే. జగన్మోహహన్‌ రెడ్డి ప్రస్తుతం ఏపీలో పాదయాత్ర సాగిస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్‌ నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టినా అదే ఫలితాలు సహజంగా అసెంబ్లీలోనూ ప్రతిఫలిస్తాయి. కొన్ని మార్పులు ఉన్నా..చంద్రబాబుకు ఎదురుగాలి అనే విషయం సర్వే స్పష్టం చేస్తోంది. అయితే కాంగ్రెస్‌తో పొత్తు ఉంటేనే ఈ సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే మొత్తం విూద ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే విషయం ఈ సర్వే ద్వారా తేలింది. వైసీపీ, కాంగ్రెస్‌ జట్టుకడితే వచ్చే ఎన్నికల్లో 50 శాతంపైగా ఓట్లు ఈ కూటమికే వస్తాయని..అసెంబ్లీ, పార్లమెంట్‌ సీట్లను ఈ కూటమి భారీ ఎత్తున దక్కించుకునే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఇవన్‌ఈన జాగ్రత్తగా గమనిస్తున్న చంద్రబాబు ఆయన టీమ్‌ వైకాపాపై బురదజల్లి దానిని అడ్రస్‌ లేకుండా చేయాలని చూస్తున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా పెద్ద హావిూలు అమలు చేయడంలో టిడిపి విజయం సాధించలేకపోయింది. బిజెపితో నాలుగేళ్ల సాహచర్యంలో కూడా పెద్దగా ఎపికి ఒరిగిందేవిూ లేదు. ఈ దశలో సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఒక్క రోజు దీక్ష చేపట్టారు. ధర్మపోరాటాలు చేస్తున్నారు. మరో వైపు టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ‘ఉక్కు దీక్ష చేపట్టారు. ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి, మంత్రులు..ఎంపీలు దీక్షలు చేయడం ద్వారా ప్రతిపక్షాలకు సమస్యలు లేకుండా చేయాలన్న వ్యూహంలో బాబు సాగుతున్నారు. వాస్తవానికి కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది కేంద్రం. విభజన చట్టంలో కడప స్టీల్‌ ప్లాంట్‌ అంశం ఉంది. కానీ చంద్రబాబు ‘రాజ్యాంగం’ ప్రకారం సీఎం రమేష్‌ దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కదా?. కడపలో చేస్తే ఏమి వస్తుంది? నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కడప స్టీల్‌ ప్లాంట్‌ పై చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ నాలుగేళ్లలో వెనకబడిన కడప జిల్లా ప్రాజెక్టు కోసం ఎందుకు కేంద్రంపై ఒత్తిడి చేయలేదని ఇప్పుడు విపక్షాలు ప్రశ్నిస్తు న్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర అవుతుండటం..అదీ ప్రతిపక్ష నేత జగన్మోహన్‌ రెడ్డికి చెందిన జిల్లా కావటంతో ఈ దీక్షల ద్వారా అయినా వైకాపా ఓట్లకు గండికొట్టాలన్నది బాబు వ్యూహంగా ఉంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కోసం నూతన రాజకీయ ప్రత్యామ్నాయ ఏర్పాటుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి వేదికగా కసరత్తు చేస్తున్నాయి. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. నవ్యాంధప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి, సామాజిక న్యాయ సాధనకు, ప్రజా సంక్షేమ కల్పనకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ కార్యక్రమం ముందడుగుగా సాగనున్నారు. అమరావతి నిర్మాణం త్రీడీలో చూపి మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. మొత్తంగా ఎవరికి వారు వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయం వేడెక్కిస్తున్నారు.