అధికారిక లాంఛనాలతో హరీశ్వర్‌ రెడ్డి అంత్యక్రియలు.. ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించిన సీఎం కేసీఆర్‌

 అధికారిక లాంఛనాలతో హరీశ్వర్‌ రెడ్డి అంత్యక్రియలు.. ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించిన సీఎం కేసీఆర్‌

పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఏపీ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్‌ రెడ్డి (Koppula Harishwar Reddy) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ (CM KCR) నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సూచించారుబీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన కొప్పుల హరీశ్వర్‌రెడ్డి(78) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పరిగిలో నివాసముంటున్న ఆయనకు శుక్రవారం రాత్రి 10.10 గంటల సమయంలో గుండెపోటు వచ్చిందని, వెంటనే పట్టణంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. హరీశ్వర్‌రెడ్డి 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికలలో పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన హరీశ్వర్‌రెడ్డి పరిగి ఉపసర్పంచ్‌గా, 1978లో సర్పంచ్‌గా, సమితి వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పరిగిలో నిర్వహించనున్నారు. హరీశ్వర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేశ్‌రెడ్డి ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.ప్రజాభిమానం పొందిన నేత: సీఎం కేసీఆర్‌
మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. పరిగి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాభిమానం పొందిన నాయకుడు హరీశ్వర్‌రెడ్డి అని సీఎం కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. హరీశ్వర్‌రెడ్డి కుమారుడు ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.