అధికారుల తప్పిదానికి బలైన పోయిన మహిళా రైతు.

ఆరేకరాల భూమి కోసం నానాతిప్పలు.
– నాలుగేళ్లుగా కార్యాలయాల చుట్టు తిరుగుతున్న పరిష్కారం కానీ సమస్య.
– పట్టించుకోని అధికారులు.
పోటో: భూమి పత్రాలను చూపిస్తున్న మహిళా రైతు.
నెన్నెల,సెప్టెంబర్19,(జనంసాక్షి)
తహసీల్దార్ కార్యాలయ అధికారులు చేసిన తప్పిదానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. సమస్య చిన్నదే అయినప్పటికీ ధరణి పోర్టల్ రావడంతో సమస్య పరిష్కారం కాక రైతులు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాల్లోకి వెళితే నెన్నెల మండలం గన్ పూర్ గ్రామంలో గన్న లక్ష్మీ భర్త రాజయ్యకు సర్వే నెంబర్ 31లో 6.05 ఆరు ఎకరాల అయిదు గుంటల భూమి పట్టా ఉంది. ఇట్టి భూమిని ఆ మహిళా రైతు తేదీ 19-07-1985 లో కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకుంది. డాక్యుమెంట్ నెం. 629/c/ 1985 ద్వారా పట్టా మార్పిడి చేయించుకుంది. 1985 సంవత్సరం నుంచి 2017 సంవత్సరం వరకు పట్టా, బ్యాంకులో పంట రుణం అన్ని సక్రమంగా జరిగాయి. ఎప్పుడైతే ప్రభుత్వం భూ ప్రక్షాళన పేరుతో వివరాలు సేకరించిందో అప్పటినుంచి పట్టా వేరే వ్యక్తుల పేర్లతో రావడంతో ఆ మహిళా రైతు ఈ నాలుగేళ్ళ కాలంలో సమస్య పరిష్కారం కోసం కొన్ని వందల దరఖాస్తులు ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ‘జనంసాక్షి’ కి తన గోడు వెళ్లబోసుకుంది.
ఇదీ సమస్య.
గన్ పూర్ గ్రామంలో బాధిత మహిళా రైతు గన్న లక్ష్మీ భర్త రాజయ్యకు 31 సర్వే నంబర్ లో 6.05 ఆరు ఎకరాల అయిదు గుంటల భూమి పట్టా ఉంది. మరో మహిళా రైతు అయిన గన్న లక్ష్మీ భర్త రాజయ్యకు ఇదే గ్రామ శివారులో సర్వే నంబర్ 22/2లో 1.35 ఎకరం ముప్పై అయిదు గుంటలు, 159/2/2 లో 1.20 ఏకరంన్నర భూమి పట్టా ఉంది. ఇద్దరి పేర్లు, వారి భర్తల పేర్లు ఒకటే కావడంతో ఈ బాధిత మహిళా రైతు పేరున నమోదు కావాల్సిన భూమి పట్టా మరో మహిళపై నమోదు అయింది. నూతన పట్టా పాస్ పుస్తకం రాకపోవడంతో కార్యాలయానికి వెళ్లి కనుక్కోగా అట్టి భూమి తన పేరే ఉన్న తన సమీప బంధువు పేరున నమోదు అయిందని తెలుసుకొని పట్టా సరిచేయాలని అధికారులకు మొర పెట్టుకుంది. అయిన ధరణి పోర్టల్ లో ఇట్టి సమస్యకు పరిష్కారం లేదని అధికారులు నాలుగేళ్లుగా తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవైపు ఇటు పట్టా రాక బాధపడుతుంటే అటు పంట రుణం తీసుకున్న వాటికి డబ్బులు చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారని బాధ వెళ్లగక్కింది. అంతే కాకుండా అధికారుల తీరు వల్ల నాలుగేళ్ళ రైతు బంధు సుమారు ₹ రెండు లక్షల నలబై వేల రూపాయలు నష్ట పోయానని, ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని రాయితీలు రాకుండా పోయాయని వెల్లడించింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.