అధునాతన పద్దతులతో మెరుగైన వ్యవసాయం

అనంతపురం,జూన్‌19(జ‌నం సాక్షి): వ్యవసాయంలో నూతన పద్ధతులు పాటించాలని వ్యవసాయాధికారులు సూచించారు. రైతులు మెట్ట భూముల్లో కందులు, సజ్జలు వేసుకుంటే అధిక దిగుబడులు సాధించ వచ్చన్నారు. పత్తి పంటలను వేయకుండా చిరుధాన్యాలైన జొన్నలు, రాగులు, పప్పు దినసుల పంటలు వేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఆరుతడి పంటలు వేసుకోవడం వల్ల శ్రమ తక్కువ కావడమే కాక, దిగుబడులు ఎక్కువగా వస్తాయని తెలిపారు. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయాన్ని ఖరీఫ్‌లో ఉద్యమంలా రైతులు చేపట్టి సాగు విస్తీర్ణం పెంచేలా క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు అధికారులు కృషి చేయాలని సూచించారు. రసాయనిక ఎరువులు వాడకం ద్వారా పంట ఉత్పత్తులు విషతుల్యమై అనారోగ్యం పాలవుతున్నామన్నారు. పాత పద్ధతుల్లో సాగు చేపట్టాలని సూచించారు. పంటల సాగు ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచేలా చూడాలని అధికారులను కోరారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ సాగును జిల్లాలో పలు చోట్ల చూశానని, రైతులు కూడా ఆశాజనకంగా ఉందని, నాణ్యమైన దిగుబడులు వచ్చాయని తెలిపారు. ఎక్కువ మంది రైతులు ఈ వ్యవసాయాన్ని చేసే విధంగా చూడాలని సూచించారు.మామిడి, అరటి పంటల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించి నాణ్యమైన ఉత్పత్తులను పొంది, మార్కెట్లో మంచి ధర పలికి ఆర్థికాభివృద్ధి సాధించానన్నారు. జిల్లాలో కరువును ఎదుర్కొనేందుకు పాటించాల్సిన వ్యవసాయ పద్దతులు, సాంకేతిక పరిష్కారంపై రైతులు అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. జిల్లాను కరువు రహిత జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కరువును ఎదుర్కొనేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటోందన్నారు. నీరు- ప్రగతి కార్యక్రమంలో అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు వేల ఎకరాల పండ్ల తోటలకు రక్షక తడులను అందిచామన్నారు. సేంద్రియ ఎరువులను వాడాలని తెలిపారు. ఈ యేడాది వర్షభావ పరిస్తులు తలెత్తితే మొబైల్‌ లిప్ట్‌ ద్వారా రక్షక తడులను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.