‘అధూరె’ జిందగీలకు ప్రతీకలు
స్కైబాబ కథల సంకలనం ‘అధూరె’ ముఖ్యంగా గ్రామీణ,పట్టణ నేపథ్యంలో ముస్లింల దైనందిన జీవితంలోని అనేక కోణాలను మన ముందు ఆవిష్కరిస్తుంది. ఈ సంకలనంలోని అన్ని కథలు ఏదో ఒక మేరకు అసంపూర్ణాలు. అందువల్ల ‘అధూరె’ అనే పేరు ఈ సంకలనానికి తగినది. అయితే, పాఠకుడే ఈ కథలను పరిపూర్ణం చేయాలి. ఒక హక్కుల ఉద్యమ కార్యకర్తగా, ముస్లింగా ఈ కథలను చదివినప్పుడు ముస్లింల రాజకీయాల నేపధ్యం కళ్ల ముందు కనబడుతుంది.
ముస్లింల జీవితాలను అర్థం చేసుకోవటం ముస్లిమేతరులకు అంత సులువు కాదు. మరోవైపు గ్రామీణ ముస్లింలు అధికంగా ముస్లిమేతర సోదరుల వల్ల ప్రభావితమై వున్నారు. ఈ కథల్లో ఈ వాస్తవం వ్యక్తమవుతోంది. ప్రేమ,పెళ్లి, వరకట్నం,పర్దా /బుర్ఖా, ఆచారాలు, ఆర్థిక స్ధితిగతులు, విద్య,ఉద్యోగం,వలస,జాతీయత,కులం,అక్రమనిర్బంధం,హింస,వేధింపులు,వంటి అనేక అంశాలు ఈ కథల్లో ప్రతిఫలించాయి. అదేవిధంగా సామిజిక అంశాలు. అయితే వీటిని మత కోణం నుంచి కాక ‘సరిగా’ అర్థం చేసుకోవాల్సిన కోణాలు అనేకం ఉన్నాయి.ముస్లింలు శతాబ్దాలుగా సామాజిక ఆర్థిక,రాజకీయంగా అనేక పరిణామాలకు లోనైన తీరును చారిత్రక దృష్టి నుంచి పరిశీలించాలి.
ఈ దేశాన్ని శతాబ్దాలపాటు పాలించిన ముస్లింలు ప్రతిసారి సామ్రాజ్య విస్తరణ కోసం ప్రయత్నించారు. కాని వారి పాలన నిజమైన అర్థంలో ఇస్లామీయమైనది కాదు. చరిత్రను అగ్రకుల హిందూత్వ భావజాల పాలకులు నాశనం చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా చరిత్రను రాయించి ఉపయోగిం చుకున్నారు. చరిత్రను నాశనం చేయటమే కాదు బడి పిల్లల మనసుల్లో తప్పుడు చరిత్రను, పాఠ్యాంశాల పేరుతో ముస్లిం వ్యతిరేకతను నాటుతున్నారు. బ్రిటీషు వాళ్ల్ల్లు వ్యాపారం పేరుతో వచ్చి మనల్ని ఆక్రమించుకున్న తర్వాత మన దేశంలోని ప్రజలు అనేక ఆచార వ్యవహారాలున్న కులాలుగా విడిపోయి జీవిస్తున్న సంగతిని గుర్తించారు.నెమ్మదిగా వాళ్లు ‘విభజించు పాలించు’ అనే సూత్రాన్ని అమలు చేశారు. అదే చివరికి ఇండియా, పాకిస్తాన్‌గా ఈ దేశ విభజనకు దారి తీసింది. వాస్తవానికి ఈ విభజన విధానం బ్రాహ్మణీయ హిందూత్వవాదుల విధానం. ఆ విధానాన్ని తెల్లవాళ్లు ఒక అవకాశంగా తీసుకున్నారు.
దేశ విభజనకు మౌంట్‌బాటెన్ ప్రతిపాదిస్తే మహ్మద్ అలీ జిన్నా వ్యతిరేకించినప్పటికీ బలవంతంగా అతన్ని అంగీకరింపజేశారు.నిజానికి దేశ విభజన ప్రతిపాదనను సిద్ధం చేసింది రాజగోపాలచారి. 1943లోనే దేశ విభజన ప్రతిపాదన చేసి గాంధీ ఆమోదం కూడా పొందాడు. ఆధునిక భారత నిర్మాతగా చెలామణి అవుతున్న నెహ్రూ, ‘ఉక్కుమనిషి’గా ప్రసిద్ధిగాంచిన వల్లభ భాయి పటేల్ ఇద్దరూ మౌంట్‌బాటెన్‌తో సంప్రదింపులు జరిపి దేశ విభజనకు అంగీకరించారు. ఆ తర్వాత గాంధీని దేశ విభజనను అంగీకరించారు. ఆ తర్వాత మౌంట్‌బాటెన్ గాంధీని దేశవిభజన విషయమై చర్చించేందుకు ఆహ్వానించాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్‌తో దేశ విభజనను అంగీకరించే ప్రసక్తే లేదని గాంధీ అన్నాడు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఆజాద్ అంగీకారం ఉండాలనే హమీతో గాంధీ చర్చలకు వెళ్లాడు. ఆజాద్‌ను కార్యాలయం గది బయటే ఉంచి లోనికి వెళ్లిన గాంధీ ఏమి సమాలోచన చేశాడో తెలియదు గానీ బయటికి వచ్చిన తర్వాత దేశ విభజన ఖాయమని తేల్చి చెప్పాడు. ఆజాద్ ఊహించిన దానికి భిన్నంగా జరిగింది. అయినప్పటికీ ఆజాద్ గాంధీ అడుగులకు మడుగులొత్తుతూ విభజనకు అంగీకరించారు. హిందూత్వ శక్తులు ఈ దేశాన్ని చేజిక్కించుకునేందుకు జరిగిన విభజన వల్ల అనేక దుష్పరిణామాలు సంభవించాయి. పాకిస్తాన్‌కు వలస వెళ్లడానికి నిరాకరించిన మేధావులు విభజన విషయంలో మౌనం వహించారు. ఆ దేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, తొలి విధ్యాశాఖామాత్యునిగా బాధ్యతలు నిర్వర్తించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన సొంత ప్రజలను కాపాడేందుకు పెద్దగా చేసిందేమీ లేదు.ముస్లింల సామూహిక ఊచ కోతను ఆపలేకపోయాడు. వల్లభబాయి పటేల్ దుందుడుకు చర్య లను ఆజాద్‌తో పాటు గాంధీ కూడా ఆపలేకపోయాడు.తన ఆత్మ కథ ‘ఇండియా విన్స్ ఫ్రీడం’ గ్రంధంలోని చివరి అధ్యాయాన్ని తన మరణానంతరమే ప్రచురించాలని ఆజాద్ రాసుకున్నాడు. ఆ అధ్యాయం ఏమైందో నేటికీ ఎవరికీ తెలియదు.కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణీయ హిందూత్వ నేతలే దాన్ని కనిపించకుండా చేశారు. ఆయన మరణం తర్వాత కూడా నిజం సమాధి చేయబడ్డది. జామా మసీదు వేదిక మీది నుండి ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్లరాదని కోరిన ఈ గొప్ప నాయకుడు, ముస్లింల రక్తంతో ఈ దేశం సంపద్వంతమైందని ప్రకటించిన ఈ నేతే ముస్లింలను కాపాడేందుకు ఏమీ చేయలేకపోతే గ్రామీణ ముస్లింల పరిస్థితి మరింత దారుణంగా ఉండదా !?
విభజన తర్వాత అత్యధిక ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్లేందుకు నిరాకరించారు. ఈ దేశ మూలవాసీ వారసులుగా భావించుకున్న ప్రజలు ఇక్కడే ఆగిపోయారు. పాకిస్తాన్‌లో వున్న ముస్లింల జనాభా కంటే మన దేశంలోని ముస్లిం జన సంఖ్యే ఎక్కువ. విభజన తర్వాత ముస్లింల మీద అణచివేత ఎక్కువైంది. దేశ విభజనలకూ, ముస్లింల అణచివేతకూ మతపరమైన కారణాల కన్నా రాజకీయ కారణాలే క్రీయాశీల పాత్ర పోషించాయి. మొదటిది, అత్యధిక ముస్లింలు ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాల నుండి ముస్లింలుగా మారినవారు. బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన కులాలే ముస్లింలుగా మారారు.ఈ ధర్మ పరివర్తన వల్ల సామాజిక అణచివేత నుండి విముక్తి పొందటమే కాదు అగ్రకులాలతో సమంగా అన్ని హక్కులు పొందారు. దీన్ని బ్రాహ్మణీయ కుల వ్యవస్థలోని అగ్రకులాలు సహించలేకపోయాయి. రెండోది,ముస్లింలు వలస పాలనలో రాజకీయంగా ప్రత్యేక నియోజకవర్గాలు కలిగి వున్నారు. అందువల్ల వలస పాలనలోని చట్టసభల్లో అగ్రకులాల ప్రమేయం లేకుండా ముస్లింలు ప్రవేశించారు. ముస్లింలు తమ అదుపులో ఉంటే తప్ప బ్రాహ్మణీయ అగ్రకులాల ఆధిపత్యం సాగదు. కాబట్టి ప్రత్యేక నియోజకవర్గాలను ముస్లింలు వొదులుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతూ వచ్చింది. అధికార బదలాయింపులో హిందువు లకు,ముస్లింలకు, అణగారిన వర్గాలకు వాటా ఉంటుందని లార్డ్ వావెల్ చేసిన అధికారిక ప్రకటనతో ముస్లిం వ్యతిరేకత తీవ్రమైంది. బ్రాహ్మణీయ అగ్రకులాలతో పాటుగా ముస్లింలు కూడా ఈ దేశానికి పాలకులనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయారు. దేశ విభజన వల్లనే అగ్రకులాలకు సంపూర్ణ అధికారం సిద్ధ్దిస్తుందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ నేతలు అదే పని చేశారు. ఫలితంగా ముస్లింలు రాజ్యాంగ సభలో గొంతు విప్పే పరిస్థితి లేదు. అప్పటి దాకా ముస్లింలకు వున్న ప్రత్యేక నియోజకవర్గాలు,విద్యా, ఉద్యోగ రంగాలలో ప్రాతినిధ్యం రద్దు చేస్తూ రాజ్యాంగ సభలో తీర్మానం చేస్తే ప్రతిఘటించే ముస్లిం ప్రతిపక్షం లేకుండా పోయింది. చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ ముస్లింల పక్షాన ప్రత్యేక నియోజకవర్గాల కోసం వాదిస్తే ఆయన్ని గాంధీ దాసుడైన మౌలానా ఆజాద్ వ్యతిరేకించారు. ముస్లింలకు ఉన్న అన్ని రక్షణలనూ తొలగించిన తర్వాత వారిని అణచివేసే విధానాలను అగ్రకుల హిందూత్వ శక్తులు ప్రణాళికబద్ధంగా అమలు చేశాయి. దేశ విభజన తర్వాత ముస్లింల రాజకీయ అణచివేత తీవ్రమైందని ప్రముఖ పండితుడు క్రిష్టోఫర్ జాఫర్‌లోట్ చేసిన వ్యాఖ్య సమంజసమే. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మన రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఒక్క ముస్లిం ఎంపి కూడా లేడు. ఈ పరిస్థితి అనేక రాష్ట్రాల్లో కొనసాగుతుంది. చివరికి ముస్లిం జనాభా అత్యధికంగా ఉండే నియోజకవర్గాల్లో కూడా హిందూత్వ శక్తులు గెలిచే పరిస్థితి ఏర్పడింది అంటే దానికి వలస పాలనలో ఉన్న ప్రత్యేక నియోజకవర్గాలు అనే హక్కును తొలగించడమే కారణం. దీనికి ఉదాహరణ రాంపూర్ నియోజకవర్గం. ఇక్కడ 90 శాతం ముస్లింలుంటారు. కాని, అన్ని పార్టీలు ముస్లిం అభ్యర్థులను నిలబెడుతాయి. బిజేపి మాత్రం ముస్లిమేతర అభ్యర్థిని నిలబెడు తుంది. ముస్లిం అభ్యర్థుల మధ్య ఓట్లు చీలి చివరికి బీజీపీ అభ్యర్థి గెలుస్తున్నాడు. ఇది ఉమ్మడి నియోజకవర్గాల విధానం వల్ల జరు గుతున్న నష్టం. ఈ విధానమే ముస్లిం బానిసత్వానికి కారణం. బ్రాహ్మణీయ భావజాలంతో ప్రభావితమైన అగ్రకులాలు ముస్లింలను సాంఘిక వేర్పాటు, ఒంటరితనానికి గురిచేశాయి. ఈ సాంఘిక వెలివేతను తప్పించుకొనేందుకు ముస్లింలు వాళ్ల గుర్తింపును దాచుకునే ప్రయత్నం చేశారు. ఇది వాళ్ల సంపన్నమైన సంస్కృతిపై దాడి తప్ప మరొకటి కాదు. క్రమంగా ఉద్యోగ నియామకాల్లో ముస్లింల సంఖ్య తగ్గిపోయింది. ఉర్దూ భాషను అధికార భాష హోదా నుండి తొలగించిన కారణం వల్ల విద్యా, ఉద్యోగాలలో ముస్లింల సంఖ్య గణనీయంగా తగ్గింది. హిందీ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉర్దూ ఒక భారతీయ భాష. కాని ఉర్దూను ముస్లిం మత భాషగా వక్రీకరించి దాన్ని సమాజం నుండి లేకుండా చేసే కుట్రలు హిందూత్వ వాదులు చేస్తున్నారు. భాషను కోల్పోవ డంతో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లి ముస్లింల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. భూ సంస్కరణ చట్టంతో ముస్లింలకు భూమి రాకపోగా ఉన్న భూములు కూడా కోల్పోయారు. ముస్లిం భూములు ఆక్రమించేందుకే చాలా చోట్ల దాడులు, అల్లర్లు జరిగాయంటే నమ్మశక్యం కాదు. దుర్భరమైన దారిద్య్రం వల్ల అనేక మంది ముస్లింలు గల్ఫ్ దేశాలకు వలస పోతున్నారు. ఇలా ముస్లింలు ఎంతగా ఆర్థిక వెలివేతకు గురయ్యారో అర్థం చేసుకోవచ్చు.
మత ప్రాతిపదికన ముస్లింలను ఒంటిరి చేయటం మరింతగా విస్తరించి పవిత్ర స్థలాల మీద నిరంతరం దాడులు చేసే వరకూ వెళ్లింది. బాబ్రీ మజీదు విధ్వంసం, గుజరాత్ మారణహోమం దీనికి అత్యంత పెద్ద ఉదాహరణలు. ఈ దాడులు తర్వాత గుర్తింపు తీవ్రమైన సమస్యగా పరిణమించింది. గుర్తింపును దాచుకొనే దశ నుండి అసెర్ట్ చేసుకొనే దశకు చేరింది. ఆ గుర్తింపును దాచుకొనే దఖలు పర్చే సాంస్కృతిక చిహ్నాలను బహిరం గంగా సొంతం చేసుకోవటం ప్రారంభమైంది.
మధ్యాసియా దేశాలను తీవ్రవాదం బూచితో అమెరికా, దాని అనుచర దేశాలు ఆక్రమించుకున్నాయి. చివరికి ఆయా దేశాలలో ప్రజాస్వామ్యం పేరుతో ఆ దేశ నేతలను హతమార్చారు. ప్రపంచమంతా హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న అమెరికా హక్కుల పరిరక్షణ పేరుతో మధ్య ఆసియా దేశాలలో దురాక్ర మణకు పాల్పడోతుంది. ఇస్లామిక్ దేశాలే లక్ష్యంగా సాగుతున్న దాడులకు మన దేశ అగ్రకుల పాలకులు వంత పాడుతున్నారు. తీవ్రవాదం పేరుతో అటు అమెరికా, ఇటు భారత ప్రభుత్వం చేసు న్న హింసకు అంతు లేకుండాపోతోంది. ఎంతోమంది అమాయక ముస్లిం యువకులను అక్రమ నిర్బంధానికి, చిత్రవధకూ, హింసకూ, వేధింపులకూ గురిచేస్తున్నారు. వాస్తవానికి హిందూత్వ బ్రాహ్మణీయ అగ్రకుల తీవ్రవాదులు చేసిన విధ్వంసాలకూ, పేలు ళ్లకూ ముస్లింలను బాధ్యులను చేశారు. ఎన్నో బూటకపు ఎన్‌కౌం టర్లలో అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. మానవ హక్కులు, పౌర హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాలకులను ప్రతిఘటిం చే నిర్మాణాత్మక శక్తులు నిర్వీర్యం కావటం విచారకరం. ముస్లింల నుంచి అలాంటి శక్తులు ఎదిగిరావాలి.
అల్లర్లు మతపరమైనవనే విశ్వాసం బలంగా ఉంది. కాని అవి రాజకీయమైనవి. ఇప్పటివరకు జరిగిన అల్లర్లన్నీ ముస్లిం లను లక్ష్యంగా చేసుకొని సాగినవే.హిందూత్వ బ్రాహ్మణీయ అగ్రకు ల దాడులు క్రిస్టియన్లను కూడా లక్ష్యంగా చేసుకొంటున్నాయి. మత హింసను నిరోధించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనే ఉద్యమం కొనసాగుతున్న సమయంలో స్కైబాబ ఈ కథల సంకలనం వెలువరిస్తున్నారు. స్కైబాబ కథలు చదివి వాటిని అనుభూతి చెందాను. సాహిత్య క్షేత్రంలో ముస్లింల జీవితాలను చిత్రిస్తున్న కథకుడు ఆయన. ఆయన సమాజ వాస్తవాన్ని చిత్రిం చటంలో ప్రదర్శించే శిల్ప నైపుణ్యం చాలా గొప్పది. సంఘ సంస్క రణ దృష్టి వున్న స్కైబాబలో హక్కుల కోణం కూడా ఉంది. దాన్ని విమర్శకులు సరిగా గుర్తించలేదేమో!
కనీజ్ ఫాతిమా
సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ సహాయ కార్యదర్శి
ముస్లిం ఫోరం ఫర్ తెలంగాణ కో-కన్వీనర్