అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

– పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
– లోతట్టు ప్రాంతాలు జలమయం
– గండంవంక వాగు పొంగి 16 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
– స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించిన ఎస్పీ
అనంతపురం, సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  అనంతపురం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురంలో సోమవారం అర్థరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడింది.. వర్షం వల్ల జిల్లాలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. కళ్యాణదుర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మడకశిరలో రాత్రి కురిసిన వర్షానికి చెక్‌డ్యాంలు పొంగాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదనీరు గ్రామాల్లోకి చేరుతోంది. యాడికిలో పలు కాలనీల్లో 2అడుగుల మేర నీరు ప్రవహించింది. యాడికి మండలం పిన్నేపల్లిలో చెరువు పొంగుతోంది. నిట్టూరు, రెడ్డిపల్లి గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. పెదవడుగూరు మండలంవెంకటంపల్లిలో వర్షానికి ఇల్లు కూలి చిన్నారి వైష్ణవి(7) మృతి చెందింది. ఉరవకొండ నియోజకవర్గం లోని విడపనకల్లు, వజ్రకరూరు మండల వ్యాప్తంగా రాత్రి కురిసిన కుండపోత వర్షం తో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లి జాతీయ రహదారుల పై ప్రవహించాయి. రహదారులన్నీ చెరువులు, కుంటలను తలపించాయి. నెల్లూరు అంకొల ఎన్‌హెచ్‌ 63 జాతీయ రహదారి పై దొనేకల్‌ వద్ద వాగె ప్రమాదకరం గా ప్రవహిస్తోంది. దీంతో బళ్ళారి గుంతకల్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కిలోవిూటర్‌ మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వజ్రకరూరు మండలం చాయపురం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో ఉరవకొండ గుంతకల్‌ మద్య రాకపోకలు స్తంభించిపోయాయి. పంటపొలాలు నీట మునిగాయి. పట్టణంలో పలు కాలనీల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలలోకి కూడా భారీ నీరు చేరింది. అటు, గుత్తి మండల వ్యాప్తంగా కురిసిన కుండపోత వర్షం తో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగి రోడ్లపై ప్రవహించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు 15 సంవత్సరాలుగా పారని ఉప్పువంకా, పెద్దవంకవాగులు పొంగిపొర్లాయి. కొండ ప్రాంతం నుండి డ్రైనేజీ ద్వారా పెద్ద కొండచిలువ కొట్టు రావడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. స్థానిక యువకులు కొండచిలువను కొట్టి చంపేశారు. గుత్తి మండల వ్యాప్తంగా బసినేపల్లి, చ్చానుపల్లి, కొజ్జేపల్లి, అనగానిదొడ్డి,కొత్తపేట, మాముడూరు, పూలకుంట, పి.ఎర్రగుడి, మాముడురు, ఈశ్వరపల్లి గ్రామాలలో భారీ వర్షం కురింది. దీంతో పంట పొలాల్లోకి నీరు చేరాయి. మరోవైపు గండవంక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ పరిధిలోని 16గ్రామాలకు రాకపోకలు నిలిపోయాయి. స్వయంగా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.