అనంతలో పార్కింగ్‌ సమస్యలు

మున్సిపల్‌ కాంప్లెక్స్‌ సెల్లార్‌లో అక్రమ నిర్మాణాలు
నగర పాలక సంస్థలో వింత వైఖరి
అనంతపురం,నవంబరు9 (జనం సాక్షి):   నగరంలో గత కొన్నేళ్లుగా పార్కింగ్‌ సమస్య నెలకొంది. కార్పొరేషన్‌ పరిధిలో క్లాక్‌టవర్‌ కూడలిలో ఉన్న మున్సిపల్‌ కాంప్లెక్స్‌లోని దుకాణాలు, వ్యాపార సముదాయాలకు పార్కింగ్‌ లేదు. కేవలం ఆ కాంప్లెక్స్‌లోని అండర్‌గ్రౌండ్‌లోనే పార్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రాంతాన్ని కూడా నగరపాలక సంస్థ అధికారులు వదిలిపెట్టడం లేదు. సచివాలయ కార్యాలయాల పుణ్యమా అని సెల్లార్‌లోని ఖాళీ ప్రాంతంలోనే గదులు నిర్మించేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే నగరంలో సచివాలయ కార్యాలయాలకు భవనాలే దొరకడం లేదని సమాధానం చెబుతున్నారు. ప్రస్తుతం నగర నడిబొడ్డున క్లాక్‌టవర్‌ వద్ద ఉన్న మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో మూడు సచివాలయ కార్యాలయాలకు గదుల నిర్మాణం జరుగుతోంది. అధికారులే ఇలా చేస్తే… ఇక ఇతర భవన యజమానులు ఊరుకుంటారా? అనేదే ప్రశ్న. నగరంలో అనేక భవనాలు నిర్మించారు. గతంలోనూ, కొన్ని భవనాలకు ఇప్పుడూ సెల్లార్‌లను ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. కొందరు వాటిని కేవలం పార్కింగ్‌కు మాత్రమే వదిలేస్తున్నామని చెబుతున్నారు. టౌన్‌ప్లానింగ్‌ నిబంధనల మేరకు నగరంలో సెల్లార్‌కు అనుమతే లేదు. వాటిని కమర్షియల్‌గా ఉపయోగించకూడదు. కానీ కొందరు యథేచ్ఛగా కమర్షియల్‌గానే వాడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు మాత్రం అమ్యామ్యాల మత్తులో పడి అడ్డదిడ్డంగా నిర్మాణాలకు అనుతిచ్చేశారు. అందులో భాగంగా ఒక్కో భవనానికి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు.
నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 72 సచివాలయ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఆ మేరకు కార్యాలయాలకు భవనాలు చూడాల్సి ఉంది. ఇప్పటివరకు మున్సిపాలిటీకి సంబంధించిన కమ్యూనిటీ భవనాలు, పాత పాఠశాలలు, ఇతర భవనాలు గుర్తించారు. అలా మొత్తం 53 వరకు మున్సిపాలిటీ ఆస్తుల పరిధిలో, మిగిలిన 19 కార్యాలయాలకు ప్రైవేట్‌ భవనాల కోసం అన్వేషిస్తున్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన భవనాల్లో 35 ఏర్పాటుకు సిద్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు. కమలానగర్‌లో బాడుగ కోసం వెతికినా అధికారులకు దొరకలేదట. దీంతో ఏంచేయాలో తెలియని అధికారుల దృష్టి ఏకంగా మున్సిపల్‌ కాంప్లెక్స్‌పై పడింది. మరి ఉన్నతాధికారులకు ఎవరు సెలవిచ్చారో కానీ వెంటనే అక్కడ మూడు కార్యాలయాలకు గదుల నిర్మాణం ప్రారంభించాలని ఆదేశాలందడంతో నిర్మాణ పక్రియ మొదలెట్టారు. కార్పొరేషన్‌ పరిధిలో ఎన్నో భవనాలు, స్థలాలు ఆక్రమణలకు గురైనా పట్టించుకోని అధికారులు… ఇప్పుడు భవనాలు దొరకడం లేదని చేతులెత్తేయడం విడ్డూరంగా ఉంది.