అనంతలో లోకేశ్ పర్యటన
అనంతలో ఇంటింటికీ నీరందిస్తామని హావిూ
అనంతపురం,జూన్13(జనం సాక్షి ): అనంతపురం జిల్లాలో 2020నాటికి ప్రతి ఇంటికీ కుళాయి సౌకర్యం కల్పిస్తామని మంత్రి లోకేష్ హావిూ ఇచ్చారు.. అనంతపురం జిల్లా గుండుమలలో పర్యటిస్తున్న లోకేష్ మాట్లాడుతూ… వెయ్యి కోట్ల రూపాయిల వ్యయంతో ప్రతి ఇంటికీ కుళాయి సౌకర్యం కల్పించడానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో 500 కోట్ల రూపాయిలతో సిసి రోడ్లను నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు.రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఆయన బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో జిల్లాకు చేరుకున్నారు. లోకేశ్ మడకశిరకు చేరుకోగానే తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మార్గమధ్యలో ఎన్టీఆర్, వాల్మీకి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన లోకేశ్ పార్టీ నేతలతో కలిసి ముందుకు సాగారు. మడకశిర నుంచి గుండుమల గ్రామానికి చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకుశంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లోకేశ్ వెంట మంత్రులు దేవినేని ఉమా, పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.