అనంతసాగర్‌లో నేడు వసంతపంచమి వేడుకలు
సిద్దిపేట,ఫిబ్రవరి9(జనంసాక్షి): ఈ నెల 10న వసంత పంచమి పురస్కరించుకొని చిన్నకోడూరు మండలం అనంతసాగర్ సరస్వతి క్షేత్రంలోమూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. భక్తులు ఆలయానికి చేరుకునేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడిపించనుంది. ఇక వేడుకల నిమిత్తం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సహజ సిద్ధంగా ఏర్పడిన జలగుహాల సోయగాల మధ్య ఆధ్యాత్మిక కేంద్రంగా అనంతసాగర్ సరస్వతి క్షేత్రం విరాజిల్లుతోంది. దేశంలోనే వీణపాణియై నిల్చున్న రెండో సరస్వతి క్షేత్రం
కావడం విశేషం. ఏటా సరస్వతి జన్మదినం రోజున అక్షరాభ్యాసాలకు ఇక్కడ ప్రాధాన్యం ఉంది. ఇతర జిల్లాల నుంచి వచ్చే భక్తులు బస చేసేందుకు ఆర్యవైశ్య సంఘం వసతిగృహాలు ఉన్నాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్షరాభ్యాసాలు, కుంకుమార్చనలు, ఒడిబియ్యం సమర్పణ వంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక చివరి రోజున అన్నదానం ఉంటుందని ఆలయ నిర్మాత అష్టకాల నరసింహరామశర్మ తెలిపారు.


