అనతికాలంలోనే తెలంగాణ అభివృద్ది

` ఇందుకు చేస్తున్న పనులే గీటురాళ్లు
` విమర్శకులకు అభివృద్దితో సమాధానం చెప్పాం
` ఎన్నికలు వస్తే ఆగం కావద్దు
` ఆలోచించి ధీరత్వం ప్రదర్శించాలి
` అభివృద్ధి చేస్తున్న వారినే ఆదరించాలి
` తెలంగాణ ఏర్పడ్డాక ఎన్నో పథకాలు పెట్టాం
` ప్రగతిలో తెలంగాణ ఆదర్శం
` మెదక్‌ సభలో సీఎం కేసీఆర్‌
` కలెక్టరేట్‌,ఎస్పీ కార్యాలయాలు ప్రారంభం
` జిల్లాకు ముఖ్యమంత్రి వరాలు
` మెదక్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 50 కోట్ల నిధులు
` ఏడుపాయల టూరిజానికి రూ.100 కోట్లు
మెదక్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అన్నారు. పరిపాలన చేతకాదన్న వారికి అభివృద్దితో సమాధానం చెప్పామన్నారు. దాదాపు 60, 70 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఇతర రాష్టాల్రతో పోల్చితే తెలంగాణ లో అభివృద్ధి గణనీయంగా జరిగిందని తెలిపారు. కేవలం తొమ్మిదిన్నర ఏండ్లలోనే రాష్ట్రంలో ఇతర రాష్టాల్రు ఆదర్శంగా తీసుకునే స్థాయికి ఎదిగిందని చెప్పారు. కొన్ని రాష్టాల్లో సరైన అసెంబ్లీ, సెక్రెటేరియట్‌ కూడా లేవన్నారు. మనం 33 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడమేగాక ఇప్పుడు 24వ కలెక్టరేట్‌ను కూడా ప్రారంభించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని సీఎం చెప్పారు. నూతన కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించు కున్నందుకు మెదక్‌ జిల్లా ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. మెదక్‌ కలెక్టరేట్‌ ఆర్కిటెక్చర్‌ ఉషారెడ్డి మన తెలంగాణ బిడ్డేనని సీఎం కేసీఆర్‌ ఆమెకు అభినందనందించారు. అభివృద్దికి కొన్ని గీటురాళ్లు ఉంటాయని, కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం కావచ్చు..ఇవన్నీ చూస్తే ఎంతగా అభివృద్ది చెందామో అర్థం అవుతుందని అన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఉన్నదని, స్వచ్ఛమైన నీటిని ఇంటింటికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని జిల్లాల్లో నిర్మించుకున్న ఈ పరిపాలనా భవనాలు చూస్తేనే మన రాష్ట్ర అభివృద్ధి గురించి తెలిసి పోతుందన్నారు. గతంలో చేతగాని పాలకుల వల్ల రాష్ట్రం వెనుకబడి పోయిందన్నారు. ఇప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతున్నా నాటి చేతగాని పాలకులు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రూ.200 ఉన్న ఆసరా పింఛన్‌లను ఇప్పుడు రూ.4000 తీసుకొచ్చామని చెప్పారు. మెదక్‌ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్‌ సొమ్ము పంపిణీ, బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్‌ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించి లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. అంతకు ముందు మెదక్‌ జిల్లాలో జిల్లా సవిూకృత కార్యాలయాల సముదాయాన్ని  ప్రారంభించారు. సీఎం కలెక్టరేట్‌ ప్రాంగణంలోకి చేరుకోగానే పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయం బయట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే జిల్లా పోలీస్‌ ఆఫీస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు.  నూతన కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించుకున్నందుకు మెదక్‌ జిల్లా ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. మెదక్‌ కలెక్టరేట్‌ ఆర్కిటెక్చర్‌ ఉషారెడ్డి మన తెలంగాణ బిడ్డేనని సీఎం కేసీఆర్‌ ఆమెను అభినందించారు. కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద సీఎస్‌ శాంతి కుమారి రిబ్బన్‌ కట్‌ చేశారు. కార్యాలయంలోపల ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. నేతలు, అధికారులతో కలిసి వేద పండితుల ఆశీర్వచననాలు తీసుకున్నారు. తర్వాత జిల్లా కలెక్టర్‌ను కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సందర్భంగా ముస్లిం, క్రిస్టియన్‌ మత పెద్దలు తమ ఆశీర్వచనాలు అందించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ కలెక్టర్‌కు శాలువా కప్పి సత్కరించారు. అంతకుముందు సీఎం బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రి హరీశ్‌రావు, హోంమంత్రి మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి, తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ శాంతికుమారి, డీజీపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు. ముందుగా బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో పూజ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వదించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు.
ఎన్నికలు వస్తే ఆగం కావద్దు
ఒకరు కరెంట్‌ విూటర్లు పెడతామంటున్నారుఉ..మరొకరు 3 గంటల కరెంట్‌ చాలంటున్నారు…వీరిని దగ్గరకు తీస్తే ఆగమవుతారని గుర్తుంచుకుని ముందుకు సాగాలని సిఎం కెసిఆర్‌ పిలుపునిచ్చారు. మోటర్లకాడ విూటర్లు పెడదామా అని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దని..ఎవరేందో తెలుసుకుని ఓటేసుకోవాలని సిఎం కెసిఆర్‌ పిలుపునిచ్చారు. ఎన్నికలు రాగానే వడ్ల కల్లాల వద్దకు అడుక్కుతినే వారు వచ్చినట్లు చాలా మంది బయల్దేరుతారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎª`దదెవా చేశారు. ఎన్నికలు వస్తే ఆగమాగం కావొద్దు. ఎలక్షన్లు వచ్చిన సమయంలో ప్రజలు తమ ధీరత్వాన్ని ప్రదర్శించాలి. నిజమేంది.. వాస్తవమేంది.. ఎవరు ఏం మాట్లాడుతున్నారు. నిజమైన ప్రజా సేవకులను గుర్తించినట్లు అయితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అభివృద్ధి కూడా బాగా జరిగే అవకాశం ఉందని కేసీఆర్‌ పేర్కొన్నారు. మెదక్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఒక్కట మాట మనవి చేస్తున్నా.. ఘనపురం ఆయకట్టు గతంలో ఎప్పుడూ నీళ్లు రాలేదని కేసీఆర్‌ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క చాన్స్‌ ఇవ్వండిని అడుగుతున్నారు. ఒక్క ఛాన్స్‌ కాదు.. 50 ఏండ్లు కాంగ్రెస్‌ పాలించింది. కాంగ్రెస్‌, టీడీపీ అధికారంలో ఉన్నా ఘనపురంకు నీళ్లు కావాలంటే మెదక్‌లో ఆర్డీవో ఆఫీసు వద్ద ధర్నా చేయాలి. ప్రతి సంవత్సరం ధర్నా చేస్తే తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి కాదు. ఘనపురం కాల్వలలో తుమ్మ చెట్లు మెలిచాయి. కానీ నేను సీఎం అయ్యాక పద్మా దేవేందర్‌ రెడ్డి సర్వే
చేసి.. ఘనపురం ఎత్తు పెంచుకున్నాం. కాల్వలు బాగు చేసుకున్నాం. 30 నుంచి 40 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం. గత కాంగ్రెస్‌ నాయకులు సింగూరు ప్రాజెక్టుకు హైదరాబాద్‌కు దత్తత ఇచ్చి ఇక్కడ మన పొలాలు ఎండబెట్టారు. కానీ ఈ రోజు సింగూర్‌ను మెదక్‌కే డెడికేట్‌ చేసుకోవడం కారణంగా బ్రహ్మాండంగా జోగిపేట ప్రాంతంలో నీళ్లు పారుతున్నాయి. ఘనపురం ఆయకట్టు కింద ఒక గుంట ఎండిపోకుండా పంటలు పండిరచుకుంటున్నాం అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు చెట్టు ఒకరు, గుట్ట ఒకరు అయిపోయారని కేసీఆర్‌ గుర్తు చేశారు. భూమి ఉన్నా కూడా హైదరాబాద్‌ వచ్చి ఆటో రిక్షా నడిపే స్థాయికి దిగజారిపోయారు. దీంతో తెలంగాణ ఏర్పడగానే.. రైతును ఏ విధంగానైనా సరే బాగు చేయాలని సంకల్పంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. అదే రకంగా ఇంకా అనేక సమస్యలు పరిష్కరం చేసుకున్నాం. రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నాం. నీళ్లు మాత్రమే కాకుండా.. 24 గంటల కరెంట్‌ ఇస్తున్నాం. ఇవాళ రెండు పార్టీలో మనతో బరిలో ఉన్నాయి.. ఒకటి బీజేపీ.. మోటార్లకు విూటర్లు పెట్టాలని చెబుతున్నారు. కరెంట్‌ మోటార్లకు విూటర్లు పెట్టకపోవడంతో దాదాపు ఇవాళ మనకు రూ. 25 వేల కోట్ల నష్టం కలిగించింది కేంద్రం. కానీ ఆ బాధను అనుభవించుకుంటూ ప్రాణం పోయినా విూటర్లు పెట్టమని చెప్పాను. మరో పార్టీ.. నిన్న కాక మొన్న కర్ణాటకలో గెలిచింది. ఇష్టమొచ్చిన వాగ్దానాలు చేశారు. గెలిచిన తెల్లారే అక్కడ 7 గంటల కరెంట్‌ ఇస్తున్నారు. మళ్లీ మాకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి అంటున్నారు. తెలంగాణలో 24 గంటలు కరెంట్‌ ఇచ్చుకుంటున్నాం. వాగులో, ప్రాజెక్టులో నుంచి మోటార్లు పెట్టి నీళ్లు తీసుకుంటున్నావా అని అడిగే వారు లేరు. కాబట్టే రైతులు బ్రహ్మాండంగా పంటలు పండిరచుకుంటున్నారు అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మెదక్‌లో పారే హల్దీ వాగు, మంజీరా వాగులపై దాదాపు 30, 40 చెక్‌డ్యాంలు కట్టుకుని ఆ నదులు 365 రోజులు సజీవంగా ఉండేలా చేసుకుంటున్నాం. కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్‌ ద్వారా అక్కడ్నుంచి అవసరమున్నప్పుడల్లా వాగుల్లో నీళ్లు విడుదల చేస్తున్నాం. చెక్‌ డ్యాంలు మత్తళ్లు దుంకుతున్నాయి అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రజల నమ్మకానికి మారుపేరు కేసీఆర్‌ అయితే అమ్మకానికి మారుపేరు ప్రతిపక్షాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు విమర్శించారు.  బహిరంగ సభలో ప్రతిపక్షాలపై మంత్రి విరుచుకుపడ్డారు. ప్రతి పక్షాలు సీట్లు అమ్ముకుంటారు. అన్ని అమ్ముకుంటారని దుయ్యబట్టారు. నమ్మకం ఒక వైపు ఉంది. అమ్మకం ఇంకో వైపు ఉందని అన్నారు. మెదక్‌ జిల్లా కావాలి అనేది దశాబ్దాల కలని , నాడు ఇందిరా గాంధీ మాట ఇచ్చి తప్పారని, నేడు కేసీఆర్‌ జిల్లా చేసి చూపించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలవి తిట్ల పురాణమని ఆరోపించారు. విూరు తిట్లలో పోటీ పడితే మేం పంట పండిరచే పనిలో బిజీ ఉన్నామని వెల్లడిరచారు. సమైక్య పాలనలో అన్నం తినడానికి లేని పరిస్థితి ఉంటే నేడు ఇతర రాష్టాల్రకు అన్నం పెట్టే స్థాయికి ఎదిగామని ఆయన అన్నారు. బక్క పలుచని కేసీఆర్‌ తో తెలంగాణ వాస్తదా అని ఎగతాళి చేసిన నాయకులకు కేసీఆర్‌ తెలంగాణ తెచ్చి చూపించారని, కాళేశ్వరం పూర్తి చేసి ప్రతి పక్షాల నోరు మూయించాడని పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 10 కి 10 సీట్లు గెలిచి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపిలు కొత్త ప్రభాకర్‌ రెడ్డి,బిబి పాటిల్‌, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్‌,పద్మాదేవేందర్‌ రెడ్డి,మంత్రి వేముల ప్రశాంత రెడ్డి పాల్గొన్నారు.
మెదక్‌ జిల్లాకు సిఎం కెసిఆర్‌ వరాలు
మెదక్‌ జిల్లాకు సీఎం కేసీఆర్‌ వరాల జల్లు ప్రకటించారు. మెదక్‌ జిల్లా అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశారు. మెదక్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. మెదక్‌ జిల్లా నూతన కలెక్టరేట్‌, ఎస్‌పీ ఆఫీసుల ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్‌ జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఎన్నికలప్పుడు నేను ఒక మాట చెప్పాను విూ అందరికి పద్మ నా బిడ్డ అని.. ఆమె అడిగిందంటే ఏది కాదనే పరిస్థితి కాదు. గౌరవించి, దీవించి ఆమెను భారీ మెజార్టీతో గెలిపించారు. దాని ఫలితమే.. కలెక్టరేట్‌, ఎస్‌పీ ఆఫీసు. మంచి నాయకురాలు ఉంది కాబట్టి మంచి పనులు జరుగుతున్నాయి. నాతో ఉద్యమంలో మొదటి రోజు నుంచి ఉండి, ఆనాడు తెలంగాణ వస్తదో రాదో తెల్వదు. ఉద్యమ కార్యకర్త నుంచి జడ్పీటీసీ వరకు ఆ విధంగా.. ఈ రోజు అనేకమైన పనులు చేస్తూ విూ మధ్య ఉన్నటువంటి బిడ్డ పద్మా దేవేందర్‌ రెడ్డి అని కేసీఆర్‌ పేర్కొన్నారు. మెదక్‌ పట్టణంలో రోడ్లు చిందరవందరగా ఉన్నాయి.. అవి బాగు కావాలని పద్మ అడిగారని కేసీఆర్‌ గుర్తు చేశారు. గ్రామ పంచాయతీలకు డబ్బులు కావాలని అడిగారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ కావాలని అడిగారు. దీనికి సంబంధించి ఎల్లుండి సాయంత్రం లోగా జీవో పంపిస్తాను. ఆ విధంగానే రామాయంపేటలో కూడా డిగ్రీ కాలేజీ అత్యవసరంగా మంజూరు చేస్తాం. మెదక్‌కు రింగ్‌రోడ్డు కావాలని అడిగారు.. మంజూరు చేస్తున్నాం. అదే విధంగా ఏడు పాయల టెంపుల్‌ గతంలో ప్రకటించిన టూరిజం ప్యాకేజీలో భాగంగా 100 కోట్లతో అభివృద్ధి పనులను మంజూరు చేస్తున్నాం. పనులు కూడా మొదలు పెడుతాం. కౌడిపల్లిలో డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తాం. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 469 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఒక్కో గ్రామపంచాయతీకి రూ. 15 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నాం. అదే విధంగా 4 మున్సిపాలిటీలు మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూఫ్రాన్‌ ఉన్నాయి. మెదక్‌ మున్సిపాలిటీకి 50 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నాం అని కేసీఆర్‌ ప్రకటించారు.

తాజావార్తలు