అనాదిగా ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దుతున్నాం
` సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించాం.
` మందకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవు
హైదరాబాద్(జనంసాక్షి):ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణపై హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘’ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించాం. ఏళ్లుగా వాయిదా పడుతున్న కేసులో బలమైన వాదనలతో అత్యున్నత న్యాయస్థానాన్ని మెప్పించాం. భాజపా ప్రభుత్వాలు ఉన్న చోట కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదు. ఎస్సీ వర్గాలకు నేను సీఎంగా ఉన్నప్పుడైనా న్యాయం చేయాలని బలంగా నమ్మాను. సమన్వయం చేసుకుంటూ శాసనసభలో అందరినీ కూడగట్టాం. బిల్లును ఎవరూ వ్యతిరేకించే సాహసం చేయలేదు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా 15 శాతం రిజర్వేషన్లు కేటాయించాం. ఎస్సీల్లో గ్రూప్-1కు ఒక శాతం, గ్రూప్-2కు 9 శాతం, గ్రూప్-3కు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాం. అతి తక్కువ జనాభా కలిగి అభివృద్ధి ఫలాలు ఆశించిన వారిని గ్రూప్-1లో ఉంచాం.ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెట్టాలని 2014లో తెలంగాణ ఏర్పాడ్డాక అసెంబ్లీలో చెప్పా. దీనిపై కేంద్రానికి తీర్మానం పంపాలని కోరాం. తీర్మానం ప్రవేశపెడితే నాతో పాటు సండ్ర వెంకట వీరయ్య, సంపత్‌ను సభ నుంచి బహిష్కరించారు. మేం పెట్టిన తీర్మానాన్ని విధిలేని పరిస్థితుల్లో ఆనాడు సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సి వచ్చింది. అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్తానని ఏనాడూ తీసుకెళ్లలేదు. మందకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవు. వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. నాకంటే మోదీ, కిషన్‌రెడ్డిని ఆయన ఎక్కువగా నమ్ముతున్నారు. భాజపా ప్రభుత్వాలు ఉన్న చోట ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.