అనుమతిచ్చి అరెస్టులు చేస్తరా !
మెదక్/ సెప్టెంబర్ 29 (జనంసాక్షి) : తెలంగాణ కవాతుకు ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం కూడా తెలంగాణవ్యాప్తంగా పలువురు జెఎసి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అత్యుత్సాహంపై తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు
మండిపడుతున్నారు. అరెస్టులను ఆపుతామని ప్రభుత్వం హావిూ ఇచ్చినట్లు చెప్పిన సీనియర్ మంత్రి కె జానారెడ్డి మాట చెల్లుబాటు కావడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇచ్చారా, లేదా అనేది మంత్రులే చెప్పాలని ఆయన అన్నారు. ప్రభుత్వ హావిూపై తమకు నమ్మకం కుదరడం లేదని, అరెస్టులు ఆపుతామని ప్రభుత్వం నుంచి తమకు లిఖితపూర్వకమైన హావిూ కావాలని ఆయన శనివారం విూడియాతో అన్నారు.
తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేస్తామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ చెప్పారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా బయటి వ్యక్తులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవరావు విమర్శించారు. వెనక నుంచి ఎవరైనా అల్లరి చేస్తే బాధ్యత తమది కాదని స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ కవాతుకు ప్రతిబంధకాలు సృష్టించవద్దని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం అన్నారు. పోలీసులు ఆటంకం కలిగించరనే అనుకుంటున్నట్లు పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రులు హావిూ ఇచ్చినా అరెస్టులు జరుగుతున్నాయని కోమటిరెడ్డి అన్నారు.
మంత్రులు హావిూ ఇచ్చిన తర్వాత అరెస్టులు పెరిగాయని విమర్శించారు. అరెస్టులపై ముఖ్యమంత్రి, ¬ం మంత్రి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణవాదం లేదని చెప్పే కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, మంత్రులు కవాతుకు రావద్దని, వారు వస్తే భద్రతా సమస్యలు తలెత్తుతాయని బిజెపి నేత విద్యాసాగరరావు అన్నారు.
కవాతుకు ఓ వైపు అనుమతి ఇచ్చి, మరో వైపు అరెస్టులు చేస్తున్నారని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. అరెస్టు చేస్తే కవాతులో ఎలా పాల్గొంటారని అడిగారు. అరెస్టు చేసినవారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జానా రెడ్డి చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఇదిలావుంటే, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారంనాడు హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ అనురాగ శర్మను కలిశారు. అక్రమ అరెస్టులు ఆపాలని వారు కవిూషనర్‌ను కోరారు. దీనిపై కవిూషనర్ బదులిస్తు శాంతిభద్రతల్లో భాగంగానే అక్కడక్కడ ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పోలీసులు ఎక్కడా అనవసరంగా ఎవరినీ అరెస్టు చేయలేదని ఆయన అన్నారు.