అనుమానాలు.. అవమానాలు భరిస్తున్నాం

అటూ , ఇటూ అయితే ప్రజాభీష్టం మేరకే నడుచుకుంటాం
రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళతాం : జానారెడ్డి
న్యూఢిల్లీ, జనవరి 24 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటే తమ ధ్యేయమని, అవసరమైతే తమ పదవులకు సైతం రాజీనామా చేస్తామని మంత్రి జానారెడ్డి స్పష్టం చేశారు. గురువారం న్యూ ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అతి త్వరలోనే తెలంగాణ ఏర్పాటు ఖాయమని చెప్పారు. కొందరు సీమాంధ్రులు సమైక్యాంధ్ర ముసుగులోకి తెలంగాణను అడ్డుకొనేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈసారి కోస్తాంధ్ర నేతల ఒత్తిడి ఫలించదని స్పష్టం చేశారు. తెలంగాణ అంశంపై 28లోపు ప్రకటన రాకపోవడంతో కొన్ని అనుమానాలు, అపోహాలు నెలకొన్నది వాస్తవమేనని, అయినా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుం టుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మూడు రోజులుగా హైకమాండ్‌ పెద్దలను కలిశామన్నారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం చూపాలని కోరామని తెలిపారు.  తెలంగాణ అంశం అత్యంత జఠిలమైన సమస్య అని, దీన్ని పరిష్కరించేందుకు హైకమాండ్‌ కృషి చేస్తున్నట్లు హైకమాండ్‌ పెద్దల మాటల్లో స్ఫూరించిందని పేర్కొన్నారు. అయితే, బుధవారం నాటి ఆజాద్‌ ప్రకటన నేపథ్యంలో తెలంగాణపై అనుమానాలు, అపోహాలు మొదలయ్యాయని, విూడియా కూడా రకరకాల విశ్లేషణలు చేసి మరింత గందరగోళాన్ని సృష్టించిందన్నారు.  ఈ నెల 28-30 తేదీ అని కాకుండా.. కొద్దిరోజులు అటు ఇటైనా కూడా తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ విషయంలో హైకమాండ్‌ క్షుణ్ణంగా ఆలోచిస్తున్న తరుణంలో సంయమనం పాటించాలని ఢిల్లీ నేతలు కోరుతున్నట్లుగా తమకు  అర్థమైందన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారమయ్యే వరకు ఇరు ప్రాంతాల నేతలు, ప్రజలు సంయమనం పాటించాలని, ఆవేశకావేశాలకు లోనుకావొద్దని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న సమస్య పరిష్కారమయ్యే తరుణంలో ఘర్షణలకు తావిచ్చే పరిస్థితి కల్పించడం మంచిది కాదన్నారు.  ఇప్పటికే రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయిందని, ఈ తరుణంలో ఘర్షణ      వాతావరణాన్ని సృష్టించడం సరికాదన్నారు. హైకమాండ్‌కు తగిన సలహాలు, సూచనలు అందిస్తూ సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు. సీమాంద్ర ప్రాంత నేతలు తెలుగు ప్రాంతాల మధ్య ప్రత్యేకతను చాటుతూ, భారత ఐకమత్యం కోసం పాటుపడుతూ విభజనకు సహకరించాలన్నారు. తమ ముందు చాలా విపత్కరమైన పరిస్థితి ఉందని జానారెడ్డి అంగీకరించారు. పదవుల కోసం తాము హైకమాండ్‌పై ఒత్తిడి తేవడం లేదని విమర్శలతో పాటు రకరకాల అవమనాలు కూడా ఎదుర్కొంటున్నామని తెలిపారు. సమస్య పరిష్కారం కోసమే తాము అన్ని అనుభవిస్తున్నామని తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం రాని రోజు పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తామన్నారు.  తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడడం లేదని స్పష్టం చేశారు. రాజీనామాలు ఎప్పడు చేస్తారని విలేకరులు ప్రశ్నించగా.. పదవులు లెక్కకాదని, అవసరమైన సమయంలో తప్పకుండా చేస్తామన్నారు. తెలంగాణను వ్యతిరేకించే వారి ఆశలు నెరవేరవని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కోస్తాంధ్ర నేతల ఒత్తిడి ఫలించదని, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ప్రత్యేక తెలంగాణ తప్పకుండా ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సమైక్యవాదం అనే ముసుగులో వివిధ పార్టీలలో చేరేందుకే.. ఈ తరహా ఒత్తిళ్లు తీసుకువస్తున్నారనే విషయాన్ని గమనించాలని అన్నారు. సీమాంద్ర నేతల ఒత్తిడి తలొగ్గే హైకమాండ్‌ నిర్ణయాన్ని వాయిదా వేసిందా? అని విలేకరులు ప్రశ్నించగా.. హైకమాండ్‌ ఎవరి ఒత్తిడి తలొగ్గదన్నారు. అన్ని అంశాలను పరిశీలించి, కొన్ని పరిస్థితులను చక్కిదిద్దిన తర్వాతే నిర్ణయం ప్రకటించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ప్రకటనను వాయిదా వేసి ఉంటుందని తెలిపారు. షిండే మాట్లాడినా.. ఆజాద్‌ మాట్లాడినా హైకమాండ్‌ అభిప్రాయమేనని మరో ప్రశ్నకు బదులిచ్చారు. బడ్జెట్‌ సమావేశాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తామని టీ-ఎంపీలు చెబుతున్నారని విలేకరులు ప్రస్తావించగా.. మన ప్రభుత్వాన్ని రక్షించుకుంటూనే.. మన ప్రాంతాల ప్రయోజనాల కోసం పోరాడాలని జానారెడ్డి కోరారు. ఢిల్లీ వెళ్లిన మంత్రులు తెలంగాణ తేకుండా హైదరాబాద్‌కు వస్తే అడ్డుకుంటామన్న కోమటరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై బదులిస్తూ.. ప్రజాస్వామ్య స్ఫూర్తితో, పరస్పర ఆలోచనలతో ప్రత్యేక రాష్టాన్న్రి సాధించాలని కోరారు.