అనుమానిత యువకులకు న్యాయసహాయం అందిస్తాం

3

– ఎన్‌ఐఏ ఆరోపణలు రుజువు చేయాలి

– అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్‌

హైదరాబాద్‌,జులై 2(జనంసాక్షి): ఇస్లామిక్‌ స్టేట్‌ అనుమానిత ఉగ్రవాదులుగా పాతబస్తీలో అరెస్టయిన ఐదుగురు యువకులకు న్యాయసాయం అందిస్తే తప్పేంటని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. తాను న్యాయ సహాయం చేయకపోయినా కోర్టే న్యాయసాయం అందిస్తుందని చెప్పారు. అలాంటప్పుడు తాను సాయం చేస్తే తప్పెలా అవుతుందని ఒవైసీ ప్రశ్నించారు. అరెస్ట్‌ చేసిన ఐదుగురు యువకులపై ఎన్‌ఐఏ చేసిన ఉగ్రవాద ఆరోపణలను రుజువు చేయాలని ఆయన కోరారు. అప్పటి వరకు వారు అమాయకులేనని అన్నారు. అయితే తాను ఐఎస్‌ ఉగ్రవాదాన్ని సమర్థించడం లేదన్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులపై ఓవైసీ మండిపడ్డారు. వారికి గట్టి సమాధానం చెప్పాలని అన్నారు. ఎవరో బెదిరిస్తే తాను భయపడే రకం కాదని అన్నారు. ముస్లింలందరూ ఐసిస్‌ ఉగ్రవాదులను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇస్లాం మేధావులు వారి ఘటనలను ఖండిస్తున్నారన్నారు. ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని, ఏదో ఒక వర్గానికి చెందినంత మాత్రాన ఒక ముద్ర వేసేయడం సరికాదని అసద్‌ అన్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలతో పోలీసులు అరెస్ట్‌ చేసిన వారికి న్యాయస్థానం న్యాయం చేస్తుందన్నారు. న్యాయసాయం చేస్తానని కూడా అన్నారు. వారు నేరం చేసినట్లైతే కోర్టులు శిక్షిస్తాయని ఓవైసీ అభిప్రాయపడ్డారు.