అన్నదాతలపై వేధింపులు సరికాదు

` బ్యాంకు సిబ్బందిపై తీరుపై కేటీఆర్‌ మండిపాటు
హైదరాబాద్‌(జనంసాక్షి): రైతులపై బ్యాంకు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు సరైందికాదని, కొన్ని సంఘటనలు చూస్తే మనసు చలిస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. స్వరాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని..కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్‌ కట్టలేదని.. ఏకంగా ఆ ఇంటికి ఉన్న గేటును బ్యాంక్‌ సిబ్బంది ఎత్తుకెళ్లారని.. మరి రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని.. మాటతప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యముందా అని ప్రశ్నించారు. రుణం తీర్చలేదని రైతుపై చూపిన ప్రతాపాన్ని.. రుణమాఫీ చేయని సీఎం రేవంత్‌ రెడ్డిపై చూపించగలరా.. అని అన్నారు. పేద రైతు కు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు గుర్తు పెట్టుకోవాలని, రైతులు అంతా గమనిస్తున్నారని.. ఇలాంటి ఘోరాలను చూస్తూ ఊరుకోరని.. కాంగ్రెస్‌ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియ్యరని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కాగా బ్యాంకులో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఇంటి గేట్లు ఎత్తుకెళ్లిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడునూతులలో తండా మంజుల, మద్దెబోయిన ప్రేమలతలకు పాడిగేదెల కోసం జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉన్న డీసీసీబీ రూ.8.72 లక్షల రుణం 2021 అక్టోబరులో ఇచ్చింది. ఒక్కో గ్రూపునకు ఐదుగురు చొప్పున రెండు గ్రూపుల్లో మొత్తం 10మంది తలా ఒక పాడిగేదె కొన్నారు. అయితే కొంత అప్పు కట్టినా రెండు గ్రూపులు కలిపి మొత్తం రూ.7 లక్షల బాకీ చెల్లించలేదు. వాస్తవానికి 2023లోనే ఈ రుణ వాయిదాలు పూర్తి కావాల్సి ఉంది. దీంతో బ్యాంకు అధికారులు లబ్ధిదారులకు 2023 అక్టోబరులో లీగల్‌ నోటీసులు పంపారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో బుధవారం లబ్ధిదారుల ఇంటికి బ్యాంకు సిబ్బంది లీగల్‌ నోటీసులు ఇవ్వడానికి వె ళ్లారు. ఈ సందర్భంగా గట్టిగా అడగడంతో రూ.3 లక్షలు చెల్లించారు. అయితే రెండు రోజుల్లో మొత్తం చెల్లిస్తామన్నా వినకుండా బ్యాంకు సిబ్బంది తమ ఇంటి గేట్లు తీసుకెళ్లారని మద్దెబోయిన ప్రేమలత ఆరోపించారు. అయితే వారే తమ గేట్లు తీసుకెళ్లమన్నారని డీసీసీబీ కొడకండ్ల బ్రాంచ్‌ మేనేజర్‌ కళ్యాణి తెలిపారు.