అన్నవరంలో కొనసాగిన భక్తులు రద్దీ
వేకువ జామునుంచే దర్శనాలకు అనుమతి
అన్నవరం,నవంబరు 27 ( జనం సాక్షి ) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగింది. ప్రాఃతకాలం నుంచే స్వామి దర్శనానికి భక్తులు క్యూకట్టారు. కార్తీకపౌర్ణమి సందర్భంగా వరుసగా రెండోరోజు సోమవారం నలుమూలల నుంచి విచ్చేసిన అశేష భక్తులతో భక్తజనసంద్రమైంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని వేకువజాము నుంచే సర్వదర్శనాలు ప్రారంభించారు. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. సత్యదేవుడి సన్నిధి రెండో కార్తీక సోమవారం పర్వదినం కావడంతోపాటు పౌర్ణమి, స్వామివారి గిరిప్రదక్షణ తదితర పుణ్యదినం కావడంతో రద్దీ సోమవారం కొనసాగనుంది. స్వామివారి వ్రతం ఆచరించుకోవడానికి ఆదివారంరాత్రికే భక్తులు సత్యదేవుడి సన్నిధికి చేరుకున్నారు. అధికసంఖ్యలో భక్తులు వసతి దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉచిత డార్మెటరీలు కొందరు వినియోగించుకున్నారు.
కార్తీకపౌర్ణమి పర్వదినం సందర్భంగా సోమవారం సాయంత్రం పంపాహారతులు కార్యక్రమంఘనంగా చేపట్టనున్నారు. సాయంత్రం 6గంటలకు స్వామి,అమ్మవార్లను పంపాతీరం వద్దకు పండితులు తీసుకునివచ్చి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. అనంతరం నదీమతల్లికి ఏక, బిళ్వ, సర్ప, నాగ, నక్షత్ర తదితర ఏడు రకాలైన హారతులిస్తారు. చతుర్వేదపండితుల వేదాశీర్వచనాలు అనంతరం స్వామి, అమ్మవార్లను తిరిగి కొండపైప్రదానాలయాలనికి తీసుకెళతారు. సత్యదేవుడి సన్నిధిలో ఆదివారం జ్వాలాతోరణం కార్యక్రమం వేడుకగా జరిగింది. సాయంత్రం 5.30గంటలకు స్వామి, అమ్మవార్లను పల్లకిలో మెట్ల మార్గం గుండా మేళతాలాలు, పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ కొండదిగువ తొలిపావంచా వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత స్వామివారి తొలిపావంచాకు ఇరుపక్కల ఎండుగడ్డితో తోరణాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి 7గంటలకు భక్తుల గోవిందనామస్మరణల నడుమ జ్వాలను రగిలించారు. స్వామి, అమ్మవార్లు పల్లకిలో ముమ్మారు జ్వాలాతోరణం చుట్టూ ప్రదక్షణ గావించారు. భక్తులు జ్వాలాతోరణ భస్మం కోసం పోటీపడ్డారు. కార్యక్రమం పూర్తయ్యేవరకు వాహనాల రాకపోకలు నిలిపివేసి జాతీయ రహదారి విూదుగా మల్లించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.