అపరిశుభ్రత ఫిర్యాదుపై కలెక్టర్ సందర్శన

 

గరిడేపల్లి, సెప్టెంబర్ 13 (జనం సాక్షి):మండల పరిధిలోని వెలిదండ పాఠశాలలు గ్రామపంచాయతీలో అపరిశుభ్రత ఫాగింగ్ యంత్రం వినియోగంపై ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్ పాఠశాలలను సందర్శించే సమయంలో అపరిశుభ్రంగా ఉండటంతో గ్రామ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను పరిశుభ్రతపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రోజు విడిచి రోజు పాఠశాలలను శుభ్రం చేస్తారని వారు తెలిపారు. గ్రామంలో దోమల నివారణకై వినియోగించే ఫాగింగ్ యంత్రంపై చేసిన ఫిర్యాదుపై విచారణ చేశారు. పాఠశాలలో మన ఊరు మనబడి పనులు ప్రారంభం కాకపోవటంపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ పనులు మొదట ఎస్ఎంసి చైర్మన్ చేస్తానని చెప్పి చేయకపోవడం అనంతరం గ్రామ సర్పంచ్ చేస్తానని తెలుపటం జరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు. అయినా సర్పంచ్ పనులు ప్రారంభించకపోవడంపై అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న నిధులతో పనులు చేసి తదనంతరం ఆ నిధులను సర్దుబాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెలిదండ గ్రామపంచాయతీని సందర్శించారు. పాఠశాల గ్రామపంచాయతీలో పరిశుభ్రతపై దృష్టి సాదించాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అనంతరం కీతవారిగూడెం గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట తహసిల్దార్ కే.కార్తీక్, ఎంపీడీవో కే.వనజ, ఇన్చార్జి ఎంపీఓ భద్రయ్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, పిఎస్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ ఆదూరి పద్మకోటయ్య, కీతవారిగూడెంలో గ్రామం సర్పంచ్ కీత జ్యోతిరామారావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ రాజ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.