అపోలో మెడికల్‌ కాలేజీపై సిబిఐ విచారణ

 

హైదరాబాద్‌, నవంబర్‌ 21 : అపోలో మెడికల్‌ కాలేజీలో సీట్ల భర్తీ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. మేనేజమెంట్‌ కోటా సీట్ల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై బుధవారంనాడు హైకోర్టు విచారణ చేసింది. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగినట్టు కోర్టు గుర్తించింది. యాజమాన్య  కోటా కింద భర్తీ చేయాల్సిన 40 సీట్లలో కేవలం ఆరు సీట్లు మాత్రమే మెరిట్‌ ఆధారంగా జరిగాయని హైకోర్టు పేర్కొంది. మిగిలిన 34 సీట్లు భర్తీలో అక్రమాలు జరిగాయని కోర్టు గుర్తించి, ఆ సీట్లను రద్దు చేసింది. అపోలో మెడికల్‌ కాలేజీ సీట్ల భర్తీ వ్యవహారంపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరపాలని సిబిఐని ఆదేశించింది. ఆ కాలేజీకి సంబంధించి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని, త్వరితగతిన దర్యాప్తు నివేదిక ఇవ్వాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. అపోలో మెడికల్‌ కాలేజీలో యాజమాన్య కోటా కింద భర్తీ చేసిన సీట్లలో అక్రమాలు జరిగాయంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. అవకతవకల పేరుతో భర్తీ అయిన సీట్లను రద్దు చేయడం వల్ల ఆ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కాలాతీతమైనందున తమ పిల్లల భవిష్యత్‌ ఏమి కానున్నదోనని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.