అఫ్ఘాన్‌ను వీడే వారికి రోణ కల్పించాలి
విదేశీయులతో పాటు అఫ్ఘాన్లను కూడా అడ్డుకోవద్దు
తన డిమాండ్‌ను ప్రపంచం ముందుంచింన అమెరికా
కాబూల్,ఆగస్ట్16(జనంసాక్షి): తాలిబన్ల వశమైన అఫ్ఘానిస్తాన్ నుంచి ఎవరైనా వెళ్లిపోవాలని అనుకుంటే వారు సరిహద్దులుదాటడానికి అనుమతులు ఇవ్వాలని అమెరికా డిమాండ్ చేసింది. ప్రస్తుతం కాబూల్ చేరుకున్న తాలిబన్ దళాలు.. ఈ నగరాన్ని తమ వశం చేసుకున్నాయి. ఒక్క విమానాశ్రయం తప్ప కాబూల్ నుంచి బయటకు వెళ్లే మార్గాలన్నీ తాలిబన్ల హస్తగతం అయిపోయాయి. ఈ క్రమంలోనే అమెరికా తన డిమాండ్‌ను ప్రపంచ ముందు ఉంచింది. అఫ్ఘానిస్తాన్ నుంచి బయటకు వెళ్లిపోవాలని కోరుకునే విదేశీయులతోపాటు అఫ్ఘానీయులను కూడా తాలిబన్లు అడ్డుకోకూడదని యూఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అమెరికా ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై అమెరికా మిత్రదేశాలైన 65 దేశాలు సంతకాలు చేశాయి. కాగా, అమెరికా బలగాలు అఫ్ఘాన్ గడ్డ విూద నుంచి వెనక్కు వెళ్లిపోయిన రోజుల వ్యవధిలోనే ఈ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకోవడం అమెరికాను కూడా ఆశ్చర్యపరుస్తోందని తెలుస్తోంది. అఫ్ఘాన్‌లో ఇంత మారణహోమం జరగడానికి, తాలిబన్లు ఆ దేశంలో రాజ్యాధికారం పొందడానికి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీసుకున్న నిర్ణయమే కారణమంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. అఫ్ఘానిస్తాన్ అంతర్గత వ్యవహారంలో తాము తలదూర్చకూడదనే ఉద్దేశ్యంతో యూఎస్ బలగాలను బైడెన్ వెనక్కు పిలిపించేసిన సంగతి తెలిసిందే. ఈ పక్రియ ఆగస్టు 31 నాటికి పూర్తికానుంది. ఈ క్రమంలో అమెరికా బలగాలు అఫ్ఘాన్ దాటి వెళ్లిన రోజుల వ్యవధిలోనే ఆ దేశం తాలిబన్ల వశమవడం శోచనీయం. ఈ మొత్తం పరిణామాలకు బాధ్యత వహిస్తూ బైడెన్ రాజీనామా చేయాలని యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.