అఫ్ఘాన్‌ పరిణామాలకు బైడెన్‌దే బాధ్యత

రాజీనామా చేయాలని ట్రంప్‌ డిమాండ్‌
వాషింగ్టన్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): అఫ్ఘన్‌ పరిణామాలకు బాధ్యత వహించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రాజీనామా చేయాలని మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. తాలిబన్‌ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నందున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రాజీనామా చేయాలని ట్రంప్‌ పేర్కొన్నారు.
అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతోనే తాలిబన్‌లు ఆక్రమించుకున్నారని అన్నారు. ఆఫ్ఘన్‌లో జరిగిన పరిణామాలకు బాధ్యత వహిస్తూ.. బైడెన్‌ రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందని ట్రంప్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కేసులు పెరుగుదల, అమెరికా, దేశీయ వలసలు, ఆర్థిక విధానాలపై కూడా విరుచుకుపడ్డారు. ట్రంప్‌ హయాంలోనే గతేడాది దోహాలో తాలిబన్‌లతో శాంతి ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్‌ నుండి ఈ ఏడాది మే నాటికి సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలో అధికారాన్ని చేపట్టిన బైడెన్‌ ముగింపు గడువు కన్నా ముందుగానే సైన్యాన్ని ఉపసంహరించుకున్నారు. ఎటువంటి పరిమితులు విధించలేదు. తాను అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని ట్రంప్‌ ప్రకటించారు. బైడెన్‌ నేతృత్వంలో ఆఫ్ఘన్‌లో జరిగినది సరిదిద్దుకోలేని అంశమని, అమెరికా చరిత్రలోనే ఇది గొప్ప ఓటమిగా నిలిచిపోతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.