అభివృద్దికి చిరునామాగా తెలంగాణ

భారీగా ప్రగతి సభకు తరలాలి

చేసిన అభివృద్దిని ప్రజలకు వివరిస్తాం: ఎంపి

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): సంక్షేమ పథకాల అమలులో మిగతా రాష్ట్రాల కంటే అన్నింటా మనమే ముందున్నామని ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.అభివృద్ది అంటే తెలంగాణను చిరునామాగా మార్చిన ఘనత కెసిఆర్‌దన్నారు. ప్రతిపక్షాలకు రాష్ట్రంలో స్ధానం లేదని ప్రగతి నివేదిక సభ ద్వారా తెలియబోతున్నామన్నారు. రైతులంతా హైదరాబాద్‌కు కదలిరావాలని, కదం తొక్కాలన్నారు. నాలుగేళ్ళ పాలనను ప్రగతినివేదిక సభ ద్వారా సీఎం వివరిస్తారన్నారు. మరో రెండు దశాబ్దాల వరకు కేసీఆరే ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 25 వేల మంది చొప్పున కదిలిరావాలన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఉమ్మడి జిల్లాను ఎంతో అభివృద్ధి పరిచారని , అనేక విధాలుగా కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకొచ్చారన్నారు. ఈ సందర్భంలో తలపెట్టిన భారీ బహిరంగ సభకు తరలిరావాల్సిన అవసరం ఉందన్నారు. 2న జరిగే ప్రగతి నివేదన సభకు భారీగా తరలివచ్చి అభివృద్దికి జై కొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నో కార్యక్రమాలతో సిఎం కెసిఆర్‌ చరిత్రను తిరగరాయడం జరిగిందన్నారు. సభ వేదికగా నూతన అధ్యాయాన్ని తిరగరాస్తామన్నారు. సభసాక్షిగా ప్రతిపక్షాలకు సవాలు విసురుతామని అన్నారు. ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఖర్చుపెడుతున్నామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు. మిషన్‌ భగీరథకు రూ.55 వేల కోట్లు ఖర్చు చేశామని, ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన గోదావరి జలాలను అందించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. దీపావళికి ప్రతి ఇంటికి గోదావరి నీళ్లు అందించనున్నామన్నారు. రూ.25 కోట్లతో మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్దరణ జరిగాయని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం చేపట్టి ప్రతిఒక్కరికీ ఉచితంగా కళ్లద్దాలు, మందులు ఇస్తున్నారన్నారు. ఈ పథకాలన్నీ వివరించేందుకు ప్రగతి నివేదిక సభను నిర్వహిస్తున్నామని, ప్రతిపక్షాలుఅసూయపడేలా సభ జరుగుతుందన్నారు.