అభివృద్దిలో మనమే ముందు: ఎమ్మెల్యే  

సిద్దిపేట,మే21(జ‌నంసాక్షి): రైతు బంధు పథకంతో రాష్ట్రంలో దాదాపు 58 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగిందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే అర్హులైన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశానని గుర్తు చేశారు. రైతుల కళ్లలో తనకు ఆనందం కనబడిందని చెప్పారు.
తీసుకున్న పెట్టుబడి సాయాన్ని వృథా ఖర్చులు చేయకుండా ఖరీఫ్‌ పంట సాగుకు వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేలు పెట్టుబడి సాయం అందించినందుకు సంతోషంగా ఉందని రైతులు తెలిపారని అన్నారు. ఇకపోతే దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మిషన్‌ భగీరథ ద్వారా పొందుతున్నారని ఎమ్మెల్యే  అన్నారు. ఏండ్ల తరబడి భయంకరమైన తాగునీటి కష్టాలను దూరం చేసిన సీఎం కేసీఆర్‌ను ఊరూరా దేవుడిలా కొలుస్తున్నారని అన్నారు. మిషన్‌ భగీరథ పథకాన్ని మొదటి దశలోనే మంజూరు చేసి గత ఐదేండ్లుగా తాగునీటి కష్టాలను దూరం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మిషన్‌భగీరథ ద్వారా అందే గోదావరి తాగునీటిని వృథా చేయవద్దన్నారు. ఎందరో నిర్వాసితులు భూములతో పాటు సర్వం కోల్పోయి భగీరథ పథకం ప్రాజెక్టులకు త్యాగం చేయడం వల్లనే మనం స్వచ్ఛమైన నీళ్లను తాగుతున్నామని ఆయన అన్నారు.  350 కిలోవిూటర్ల దూరం నుంచి గోదావరి జలాలు మన గడపలోకి వచ్చి గొంతులను తడుపుతుండటం ప్రభుత్వ సాహసోపేతమైన పథకానికి నిదర్శనమన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మిషన్‌భగీరథ పథకంలో 140 వాటర్‌ ట్యాంకులను కొత్తగా ఏర్పాటు చేసి వీటి ద్వారా ప్రతి రోజు 2 కోట్ల 40 లక్షల లీటర్ల తాగునీటిని ప్రజలకు ఇంటింటికీ అందిస్తున్నామన్నారు. నీటి వినియోగంలో ప్రజలు సహకరించాలన్నారు.