అభివృద్ది,సంక్షేమ పథకాలను దండగ అంటున్న ఈటెల


ప్రజలు ఈటెల వైపా..అభివృద్ది వైపా ఆలోచించాలి
కెసిఆర్‌ సంక్షేమ కోసం పాటుపడితే..బిజెపి ధరలతో దాడి
హుజారాబాద్‌ పర్యటనలో మంత్రి హరీష్‌ రావు ఘాటు విమర్శలు
హుజురాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే మొన్నటి వరకు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ ఇప్పుడు కల్యాణ లక్ష్మి, రైతు బంధు దండగ అంటున్నారని, ప్రజలు ఎటువైపు ఉండాలో ఆలోచించుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు సూచించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ 100 రూపాయలు చేసిందని, దీంతో రైతులకు దున్నే ఖర్చులు రూ.2 వేల నుంచి 5 వేలకు పెరిగిందని అన్నారు. సీఎం కేసీఆర్‌ రైతులకు కుడి చేతికి రైతు బంధు సాయం అందజేస్తే.. ఎడమ చేతి నుంచి బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ద్వారా లాకుంటోందని ఆరోపించారు. దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పితికితే రావని, అందుకే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని ప్రజలను ఆయన కోరారు. ఇంకా రెండున్నర ఏళ్ల పాటు సీఎంగా కేసీఆర్‌ ఉంటారని, అభివృద్ధి చేస్తామని చెప్పారు. గడియారాలు, కుంకుమ భరిణెలకు ఆగం కావద్దని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని హరీశ్‌ రావు సూచించారు. తెలంగాణ కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి కేసీఆర్‌ 11 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించారని, స్వరాష్ట్రం వచ్చాక ఎంతగా అభివృద్ధి చేస్తున్నామో ప్రజలు చూస్తున్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి ఏడాది పొడవునా నీళ్లను అందుబాటులోకి తెచ్చామని, డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లు, కల్యాణ లక్ష్మి, రైతు బంధు లాంటి పథకాలను ఎన్నో అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా స్త్రీనిధికి, బ్యాంకు లింకేజీకి వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం మహిళా సమాఖ్య భవనాలు కట్టిస్తుంటే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మాత్రం పట్టించుకోలేదని, తన నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కట్టించానని, ఇక్కడ మాత్రం ఎందుకు లేవో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. మంత్రి హరీశ్‌ రావుగురువారం హుజూరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 16 మహిళా సమ్యాఖ్య భవనాలు మంజూరు చేస్తున్నానని, హుజురాబాద్‌లో శంకుస్థాపన చేశానని, ఒక్కో భవనానికి రూ.20 లక్షలు ఇస్తున్నానని చెప్పారు. 57 ఏళ్లకే వృధాప్యపు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అభయ హస్తం డబ్బు వడ్డీతో సహా చెల్లిస్తామని, పింఛన్‌ కూడా ఇస్తామని అన్నారు. ఒక్క నియోజకవర్గంలో 38 వేల మందికి రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్లు ఇస్తున్నామని, మరో 5000 మందికి కొత్తగా ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈటల ఆత్మ గౌరవం అని మాట్లాడుతున్నారని, ఒకరు అభివృద్ధి చెందితే ఆత్మగౌరవం అవుతుందా అని హరీశ్‌ ప్రశ్నించారు. ప్రజల ఆత్మగౌరవం కోసమే అనేక పథకాలను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. హుజురాబాద్‌ నియోజక వర్గంలో డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లు రాలేదని ఆరోపిస్తున్నారని, కానీ వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఈ నియోజకవర్గానికి 4 వేల ఇండ్లు మంజూరు చేసినా ఈటల శ్రద్ధ పెట్టలేదని ఆరోపించారు. మిగతా ప్రాంతాల్లో పూర్తి చేసినట్లుగానే ఇక్కడ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని హరీశ్‌ హావిూ ఇచ్చారు. అలాగే సొంత స్థలం ఉన్న వాళ్లు ఇండ్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేయడానికి బ్జడెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించామని చెప్పారు.