అభివృద్ది కోసం ప్రత్యేక కృషి : ఏనుగు

నిజామాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా  తీర్చిదిద్దుకొవాల్సిన అవసరం ఉందని మ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి విషయంలో ఎంతో ఇబ్బందులకు గురి చేశారన్నారు. వారు అన్ని రంగాల్లో నిర్లక్ష్యం చేసి తమ వ్యక్తిగత బాగోగులు చూసుకున్నారని మండిపడ్డారు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ పదవుల కోసం కాదన్నారు. ఇక్కడి ప్రజలు అన్ని విధాలుగా బాగు పడి వారి ముఖాల్లో వెలుగులు ప్రకాశించినప్పుడే మనం నిజమైన తెలంగాణ సాధించుకున్నట్లన్నారు. వారి ముఖాల్లో వెలుగులు నింపే విధంగా కేసీఆర్‌ ప్రత్యేకంగా అలోచన చేస్తున్నారన్నారు. ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతగా జనాభాలో 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రెండో ప్రాధాన్యత వ్యవసాయ రంగానికి ఇస్తుందన్నారు. రైతులు బాగుంటేనే ప్రభుత్వ మనుగడ ఉంటుందన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి కృషి చేస్తామన్నారు. నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధికి జిల్లా నుంచి ఎంపికైన ప్రజాప్రతినిధులంతా కలసి  కృషి చేస్తామని ఏనుగు అన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన మాట మేరకు కేసీఆర్‌ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం వ్యవసాయ రుణాలను మాఫీ చేసిందని  పేర్కొన్నారు. రైతులు వ్యవసాయం కోసం తీసుకున్న బంగారం రుణాలను సైతం మాఫీ చేయటం జరిగిందన్నారు.  మాఫీ చేయటమే కాకుండా ఖరీఫ్‌ సీజన్లో తక్షణమే రుణాలు ఇవ్వాలని కూడా బ్యాంకర్లకు సూచించామన్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు అధికారులు చేపట్టారన్నారు.