అభివృద్ధికి సహకరించండి

2

– దత్తాత్రేయతో కేటీఆర్‌ భేటి

హైదరాబాద్‌,జూన్‌ 21(జనంసాక్షి):తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయను, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోరారు.

కేంద్రం సహకారంతో ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌  ప్రకటించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం కేటీఆర్‌ విూడియాతో మాట్లాడుతూ.. దత్తాత్రేయపై వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. మెట్రో పురోగతిలో ఉంది.. త్వరలోనే పూర్తి అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి దత్తాత్రేయ సహకారం కావాలని కోరుతున్నామని తెలిపారు. ఇటీవల కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్‌, కేంద్ర మంత్రి దత్తాత్రేయ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. దత్తాత్రేయను విమర్శించేంత స్థాయి నాది కాదని అన్నారు. ఐటీఐఆర్‌పై ఇప్పటికే కేంద్రానికి పూర్తి నివేదిక ఇచ్చామని ఆయన చెప్పారు. కేంద్రమంత్రులను అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మెట్రో రైలు నిధుల గురించి దత్తాత్రేయ దృష్టికి తీసుకెళ్లామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి కోరుకోవడం లేదన్నారు. ప్రజల కోసం కేంద్రంతో కలిసి పనిచేయాలని భావిస్తున్నామని కేటీఆర్‌ విూడియాకు వివరించారు. ఎఫ్‌డిఐలను పూర్తిగా సమర్థిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో తాము స్పర్ధలు కోరుకోవడం లేదని  మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఐటీఐఆర్‌ వివాదంపై కేటీఆర్‌ వివరణ ఇచ్చారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని సూచించారు. నగరాభివృద్ధికి అవసరమైన సాయం కేంద్రం అందిస్తుందని ఆయన హావిూ ఇచ్చారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చాలా అవకాశాలున్నాయని దత్తాత్రేయ తెలిపారు. రాష్ట్రంలోకి దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఐటీ రంగంలో మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. మౌలిక వసతులు కల్పిస్తే ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ మెట్రోతో పాటు ఎంఎంటీఎస్‌కు కృషి చేస్తామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రం పరస్పరం సహకరించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు మంగళవారం సాయంత్రం కేంద్రమంత్రిని కలసి వివిధ అంశాలపై చర్చించారు. మెట్రో, ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టులపై రైల్వేమంత్రితో చర్చిస్తామన్నారు. సిరిసిల్లలో బీడీ కార్మికుల కోసం 100 పడకల ఆస్పత్రికి కృషి చేస్తున్నామని మంత్రి దత్తాత్రేయ వెల్లడించారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందేందుకు హైదరాబాద్‌కు అన్ని అవకాశాలు ఉన్నాయని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. దీనికోసం సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని మరింత విస్తృతం చేసి ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తామన్నారు. మౌలిక వసతులు కల్పిస్తే ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. భాగ్యనగరాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు మరింత ముందుకు వెళ్లాలన్నారు.