అభివృద్ధిని అడ్డుకోవడమే విపక్షాల పనా?
– హరీష్
హైదరాబాద్, ఆగస్టు12(జనంసాక్షి):
ప్రభుత్వం చేసే అభివృద్ది పనులను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పనిచేస్తోందని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి, ప్రజలను ముంచిన నేతలు ఇవాళ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏ పనిచేసినా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటపల్లి రిజర్వాయర్‌లో గ్రామాలు మునగకుండా, ఆయకట్టు లక్ష్యం దెబ్బతినకుండా డిజైన్ చేస్తే అడ్డుకుంటున్నారని, అంటే ప్రజలు మునగాలని వీరి కోరికా అని ప్రశ్నించారు. ఉస్మానియా ఆస్పత్రిని కార్పొరేట్ స్థాయికి చేర్చుతామంటే అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. వర్షం పడితేకూలేలా ఉస్మానియా ఆస్పత్రి భవనం ఉందని తెలిపారు. పెచ్చులూడితో రోగులు, వైద్యులకు ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉందని వివరంచారు. అసలు పేదలకు కార్పొరేట్ వైద్యంను అందించడం కాంగ్రెస్‌నేతలకు ఇష్టం లేదా? అని నిలదీశారు. వాళ్లేమో పెద్దపెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయుంచుకుంటారని అన్నారు. ఇంత పెద్ద నగరంలో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకుందామంటే పెద్ద భవనం లేదని కళాభవనం కడదామని నిర్ణయిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం విూటింగ్ పెట్టాలంటే 20 కిలో విూటర్ల దూరంలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెల్లాల్సి వచ్చిందన్నారు. కేవలం ప్రభుత్వాన్ని పనులు చేయనియ్యొద్దనే ఉద్దేశ్యంతో గుడ్డిగా అడ్డుకుంటున్నారని, అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. నిన్న గ్రామజ్యోతి పథకం కోసం 20 కిలోవిూటర్ల దూరంలో రాజేంద్రనగర్‌లో వ్యవసాయ వర్సిటీలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఏ పనిచేసినా అడ్డుకుని, తమలాగే పనులు చేయవద్దని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని అన్నారు.