అభివృద్ధిలో దూసుకుపోతున్నాం
– సిక్కా సదస్సులో మంత్రి కేటీఆర్
హైదరాబాద్,జులై 4(జనంసాక్షి): అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నదని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు సమస్యలన్నింటినీ అధిగమించామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కరెంట్ సమస్యను అధిగమించామని చెప్పారు. కరెంట్ సమస్యను అధిగమించడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. నగరంలోని పార్క్ హయత్ ¬టల్‌లో ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. సమావేశానికి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యుత్తమమైన టీఎస్‌ఐపాస్‌ను తీసుకొచ్చామని తెలిపారు. పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసుకున్న 16 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. గత 12 నెలల్లో 2300 కంపెనీలకు అనుమతులు ఇచ్చామని గుర్తు చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఐటీ పాలసీ ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. కొత్తగా లక్షా 30 వేల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఐటీ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని ఉద్ఘాటించారు. ఐటీ రంగం విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.