అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనలు

4మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల కోసం ప్రతి గ్రామానికి రూ. 25 లక్షలు, మండల కేంద్రానికి రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. సీఎం చదువుకున్న స్కూల్ అభివృద్ధి కోసం రూ. 10 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో హైస్కూల్, జూనియర్ కాలేజ్ నిర్మించాలని ఆదేశించారు. ఏప్రిల్ 30 నాటికల్లా దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు. తాగునీటి కోసం ఎక్కడైనా మహిళలు రోడ్డెక్కితే ఆ ఊరి ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని చెప్పారు.

అంతకుముందు దుబ్బాకలో తాను చదువుకున్న పాఠశాల కొత్త భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. అటు నూతనంగా ఏర్పాటు చేయనున్న సబ్ స్టేషన్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.

ప్రజలంతా ఐకమత్యంగా ఉండి డ్రిప్ ఇరిగేషన్ ను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎర్రవల్లిలో కుంటల అభివృద్ధికి రూ. కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు త్రీ ఫేజ్ కరెంటు ఇస్తమన్నారు ముఖ్యమంత్రి. ఏప్రిల్ 30 తారీఖు వరకు గజ్వేల్ నియోజకవర్గంలో ఇంటింటికి మంచినీరు అందిస్తమని తెలిపారు. ఎర్రవల్లిలో సుమారు రూ. 29 కోట్లతో కూడవెళ్లి వాగుపై నిర్మించనున్న చెక్ డ్యాంలకు సీఎం శంకుస్థాపన చేశారు. వంద శాతం సబ్సిడీతో రూ. 42 కోట్ల 54 లక్షలతో చేపట్టనున్న డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించారు.

రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి హరీష్ రావు. మిషన్ కాకతీయ రెండో దశను వీలయినంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లోనే పూర్తిగా నిమగ్నమై పనిచేయాలని సూచించారు.

అంతకు ముందు ఎర్రవెల్లిలో జరుగుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. రామ సముద్రం చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చేందుకు శంకుస్థాపన చేశారు. 33/11 కేవీ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. తర్వాత బాలాజీ గార్డెన్ లో జరిగిన దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చిన్ననాటి మిత్రులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

తాజావార్తలు