అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
సంగారెడ్డి, జూలై 23 : దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట, దౌలాతాబాద్, మిరుదొడ్డి, దుబ్బాకలలో ఐదులక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హమాలీల విశ్రాంతి భవనాలకు పవర్ సరఫరాల శాఖమంత్రి శ్రీధరబాబు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మండలంలో మూడు సన్నబియం విక్రయం కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్య తరగతి వినియోగదారులకు అందుబాటులో ఉండేందుకు నాణ్యత గల సన్నబియ్యాన్ని కేంద్రాల ద్వారా అందజేయనున్నారని అన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 10 కిలోల వంతున అందిస్తామని కిలో 28రూ||లకే బియ్యం విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరు వినియోగించుకోవాలిని మంత్రి శ్రీదర్‌బాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్ సమక్షంలో అమ్మకం కేంద్రాలలో సన్నబియ్యం విక్రయించనున్నట్లు తెలిపారు. ఈ బియ్యం నాణ్యతలో రాజీపడేది లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు అవసరాలకు మించి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి ఇస్తామని అన్నారు. పంటలు పండించిన నలభైశాతం మంది రైతులు తిరిగి వినియోగదారులు అవుతున్నారని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరిధాన్యానికి మద్ధతు ధర అదనంగా 170 రూపాయలు కల్పించి, క్వింటాల్ 1500రూపాయలకు ధర ప్రకటించారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే ముత్యం రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. శరత్, ఆర్డీఓ వనజాదేవి, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఏసురత్నం, రైతు సంఘం అధ్యక్షుడు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.