అమరావతిని చంపి..  ఏపీ బ్రాండ్‌ను చెడగొడుతున్నారు


– వైసీపీ చేస్తున్న పనులు యువతకు అర్థంకావాలి
– అమరావతిలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలి
– అందుకే రాజధాని ప్రాంతంలో పర్యటనకు నిర్ణయం
– అమరావతిని శ్మశానంతో పోల్చడానికి మంత్రికి ఎంత అహంకారం
– జగన్‌ తప్పుడు నిర్ణయాలతో ప్రజలకు తప్పని ఇబ్బందులు
– ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
కడప, నవంబర్‌27 (జనంసాక్షి) : అమరావతిని చంపి ఏపీ బ్రాండ్‌ను చెడగొట్టేలా వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, వైకాపా చేస్తున్న దుర్మార్గపు పనులు యువతకు అర్థంకావాలని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో మూడో రోజు బుధవారం పర్యటిస్తున్న చంద్రబాబు .. కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ఏపీ రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చడానికి మంత్రికి ఎంత అహంకారమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతిని చంపి, భ్రష్టుపట్టించాలనే నీచమైన పనికి శ్రీకారం చుట్టారన్నారు. వైసీపీ చేస్తున్న పనులు యువతకు అర్థం కావాలన్నారు. అమరావతిలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలని, అందుకే రాజధాని అమరావతి ప్రాంతంలో గురువారం పర్యటిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ఏపీ బ్రాండ్‌ను చెడగొట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోందని, ఏపీకి పెట్టుబడులు రాకుండా చేస్తోందని, ఏపీ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 35లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల బాధలు వర్ణనాతీతమని, ఇల్లు కట్టుకుందామనుకునేవారికి ఇసుక దొరకడంలేదని చంద్రబాబు విమర్శించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ వల్ల ఎంతో మంచి జరిగిందన్నారు. వాళ్ల ఊరిలో ఉండే ఇసుకపై వీళ్ల పెత్తనమేంటని బాబు మండిపడ్డారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినప్పుడే విశాఖ, విజయవాడ, తిరుపతిపై దృష్టి పెట్టామని, విశాఖకు ఒకే ఒక్క ఐటీ సంస్థ వచ్చిందని చంద్రబాబు తెలిపారు. పట్టణ జనాభా ఉన్నచోటే
అభివృద్ధి ఎక్కువ జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి పెట్టకుండా అమరావతి అభివృద్ధి చెందుతుందని, అమరావతి రూ.2లక్షల కోట్ల ఆస్తి అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమవుతుందని, అప్పుడే ప్రజారాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు పెంచి… సంపద సృష్టించాలనుకున్నామని, జగన్‌ అమరావతిని చంపే దిశగా ముందుకెళ్తున్నారని విమర్శించారు. అమరావతిని కాకుండా ఈ ప్రభుత్వం ఏ సిటీని అభివృద్ధి చేస్తుందని బాబు ప్రశ్నించారు. వైసీపీ మంత్రులు నోరు విప్పితే బూతులు మాట్లాడుతున్నారని, చివరకు స్పీకర్‌ కూడా బూతులు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, తీరుమార్చుకోకపోతే ప్రజలే ఏకమైన తగిన గుణపాఠం చెబుతారని చంద్రబాబు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో కడప జిల్లా తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.