అమాత్యుల వివాదాస్పద వ్యాఖ్యలు..
నోరు మంచిదైతే ఊరుమంచిదవుతుందని సామెత ఉన్నది. మన నోరు మంచిదైతే నలుగురూ మన చుట్టూ చేరుతారు. ఇది ఇప్పుడు యూపీఏ కేంద్ర మంత్రులకు ఎంతో అవసరమనుకుంటా. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కడం. ఆనక అలా అనలేదని మీడియా వక్రీకరించిందని బుకాయించడం పరిపాటైంది. ఆర్థిక రంగంలో అపరనిష్ణానితుడిగా పేరొందిన చిదంబరం మధ్య తరగతి ప్రజలపై చేసిన వెటకారపు మాటలు బెడిసికొట్టాయి. అంతకు ముందు రోజే న్యాయ శాఖ మంత్రి ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మన్మోహన్‌సింగ్ యువనేత రాహుల్ పై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. అధినేత్రి సోనియా పార్టీ నేతలు అగ్గిలం మీద గుగ్గిలం అయ్యారు. ఖుర్షీద్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఒక విధంగా కంగుతినిపించాయి. ‘కాంగ్రెస్ భావినేత రాహుల్ గాంధీ నుంచి సైద్ధాంతిక దిశా నిరేనిర్దేశం కొరవడటమే ప్రస్తుత కాంగ్రెస్‌ను పట్టిపీడిస్తున్న సమస్య. రాహుల్ గాంధీ అతిథి పాత్రలో కొనసాగుతూ నంబర్ -2గా వ్యవహరిస్తున్నారని నిర్ద్వందంగా చెప్పవచ్చు’. – ఇలాంటి ఖుర్షీద్ వ్యాఖ్యలు యూపీఏను గందరగోళంలో పడేయకతప్పదు. గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందిన భావినేత రాహుల్‌ను ఎందుకు పనికిరానివాడిగా విమర్శించడం ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని గుత్తాధిపత్యంగా తీసుకున్న నెహ్రూ కుటుంబాన్ని వేలెత్తి చూపినట్టయింది. యువనేతను ప్రధానిని చేయాలని నెహ్రూ కుటుంబ విధేయులు చేసే యత్నాలకు గండికొట్టేవారికి ఈ వ్యాఖ్యలు అందిపుచ్చుకునే అవకాశం కల్పించినట్టయింది. ప్రధాని అయ్యే అర్హతలు ఆయన వద్ద లేవు. జనాన్ని ఆకర్షించేందుకు కాన్వాయ్‌ని ఆపేసి టీ బంకుల్లో టీ తాగడం, తట్టలు, బుట్టలు ఎత్తితే సరిపోదు. సైద్ధాంతిక దృక్పథం అంటూ లేని రాహుల్ ప్రధాని పదవికి అర్హుడు కాదనే విషయం చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. యూపీఏ ప్రభుత్వంలో రాజకీయాలు, పాలన కలగలిసిపోయి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి మన్మోహన్ ఇన్‌చార్జి కాదని సోనియానే అన్నీ తానై నడిపిస్తున్నారని, ప్రధాన మంత్రి కార్యాలయ సిబ్బంది ప్రతిచిన్న విషయానికి జనపథ్-10కు వెళ్లి నిర్ణయాలు తీసుకుంటున్నారని తేటతెల్లమైంది. ప్రజల మనోభావాలకు ఖుర్షీద్ వ్యాఖ్యలు అద్దంపట్టాయి. కాంగ్రెస్ పార్టీ – ప్రభుత్వం ఒకటిగానే ఉంటేనే అస్తవ్యస్తమైన దేశ ఆర్థిక పరిస్థితులను మన్మోహన్ గాడిలో పెట్టగలరు. లేకుంటే మార్కెట్ శక్తులెదుట నిశ్చేష్టురాలై నిలబడక తప్పదు. ఇకపోతే మరో ఆమాత్యులు చిదంబరం మధ్య తరగతి ప్రజల మనసులు గాయపడేలా చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ‘మంచినీళ్ల బాటిల్ 15రూపాయలకు, ఐస్‌క్రీం 20 రూపాయలకు కొనుక్కోవడానికి ఇష్టపడే మధ్య తరగతి ప్రజలు బియ్యం, గోధుమల వంటి ఆహార పదార్థాలపై ఒక్క రూపాయి పెంచితో గగ్గోలు పెడుతున్నారని’ చిదంబరం చేసిన చిద్విలాస పలుకులు ప్రజలకు ముల్లులా గుచ్చుకున్నాయి. విమానాల్లో తిరుగుతూ ఏసీ గదుల్లో కాలం గడిపే చిదంబరానికి మధ్య తరగతి ప్రజల అవస్థలు ఏమి తెలుసు. వారేమీ విలాసవంతులు కారు. మినరల్ బాటిల్ సంగతి అటుంచితే కాయకూరలు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. రేపోమాపో ఆర్థిక మంత్రి పగ్గాలు చేపట్టడానికి రెడీగా ఉన్న చిదంబరం నోట ఇలాంటి ఎకసెక్కపు మాటలు ఏవగింపునే కలిగిస్తాయి. చిదంబరానికి ఇలాంటి మాటలు కొత్తేమి కాదు. గతంలో కూడా పశ్చిమబెంగాల్‌లో నక్సలైట్లను అణచివేయడానికి గ్రీన్‌హంట్ ఆపరేషన్‌కు ప్రకటన చేసి ఆ తరువాత తాను అలా అనలేదని కప్పిపుచ్చుకున్నారు. అలాగే ఈ మధ్య చింతల్‌ల్నార్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు బాలికలు, 19 మంది చినిపోగా, ఆ ఎన్‌కౌంటర్‌ను సమర్థించి ఆ తరువాత పార్టీ వారే బూటకపు ఎన్‌కౌంటర్ అనే సరికి మళ్లీ తన మాటలను కప్పిపుచ్చుకోవడానికి అల అనలేదని బుకాయించారు. ఇలా కేంద్ర మంత్రి స్థాయిలో ఉంటూ రాజకీయాల్లోనూ, పాలనలోనూ తలపండిపోయిన పెద్దల నోట ఇలాంటి చిన్న మాటలు వస్తే ప్రజలు చూస్తూ ఊరుకునే అమాయకులు కారు. కీలువిరిచి వాతపెడతారు.