అమానవీయంగా శంకర్రావు అరెస్టు
తీవ్ర అస్వస్థత .. ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్, జనవరి 31 (జనంసాక్షి) :
మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రా వును పోలీసులు గురువారం అమానవీయంగా అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్ భూ ముల విషయంలో ఆయనను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కానీ అరెస్టు సమయంలో కనీసం మనుషుల్లాగా కూడా వ్యవహరించలేదు. ఆయన దుస్తులు వేసుకునేంత
వరకూ కూడా ఎదురు చూడకుండా బయటకు ఈడ్చుకొచ్చారు. ఈ చర్యతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పటికే అస్వస్థతకు గురైన ఆయన పోలీసుల తీరుతో మరింత కుంగిపోయారు. వాహనంలో ఎక్కిస్తుండగానే తీవ్ర నీరసంగా కనిపించారు. మొదట దురుసుగా ప్రవర్తించిన పోలీసులు తమ తప్పిదాన్ని పసిగట్టి వెంటనే నేరేడ్‌మెట్ స్టేషన్ నుంచి ఆయనను ముషీరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలపడంతో పోలీసులు తమ చర్యలను సమర్థించుకునే పనిలో పడ్డారు. ఆయనను అరెస్టు చేయలేదని, కేవలం విచారించేందుకు మాత్రమే తీసుకువచ్చామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ద్వారాకా తిరుమలరావు ప్రకటించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేనందునే ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ముఖ్యమంత్రి కక్షసాధింపు చర్యల్లో భాగంగానే శంకర్రావును అవమానకర రీతిలో అరెస్టు చేయించాడని మాలమహానాడు, ఎంపీ వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగాయకుడు గద్దర్, మాజీ కేంద్ర మంత్రి, ఆయన బంధువు జి. వెంకటస్వామి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఇంటాబయట విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులను తీరును బొత్స సత్సనారాయణ తప్పుబట్టారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రులు బాలరాజు, ప్రసాద్ ఖండించారు. కాగా గ్రీన్‌ఫీల్డ్స్ భూముల వ్యవహారంలో 2012 అక్టోబరులోనే శంకర్రావు అరెస్టు వారెంట్‌పై ఉన్న స్టేను హైకోర్టు తొలగించింది. నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి 875 ప్లాట్లు ఆక్రమించారని ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబారాబాద్ కమిషనరేట్ పరిధిలోని నేరేడ్‌మెట్, ఆల్వాల్ పోలీసు అధికారులు ఇంటికి వెళ్లి శంకరరావును అరెస్టు చేశారు.