అమెరికా నిర్బంధంలో 52 మంది భారతీయులు
అక్రమంగా చొరబడ్డారంటూ అదుపులోకి తీసుకున్న అధికారులు
వాషింగ్టన్, జూన్20(జనం సాక్షి ): అక్రమంగా అమెరికాలోకి చొరబడ్డారంటూ అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించిన వారిలో 52 మంది భారతీయులు ఉన్నారు. వాళ్లలో ఎక్కువ మంది సిక్కులు ఉన్నట్లు సమాచారం. మెక్సికో సరిహద్దు నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడిన వీరు ఒరెగాన్ రాష్ట్రంలో ఆశ్రయం పొందడానికి ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకొని ఫెడరల్ నిర్బంధ కేంద్రంలో ఉంచారు. నిర్బంధ కేంద్ర సందర్శనానికి శనివారం వెళ్లిన చట్టసభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. వీరితో కలిపి మొత్తం అక్కడ 123 మంది బందీలుగా ఉన్నట్లు తెలిపారు. మిగిలిన వారంతా చైనా, మెక్సికో, నేపాల్, పాకిస్థాన్, ఉక్రెయిన్ తదితర దేశీయులని చెప్పారు. అయితే వీరంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి వలస వచ్చారా అనేది తెలియరాలేదు. రోజులో 22 గంటలు ఒక చిన్న గదిలో ముగ్గురిని ఉంచుతున్నారని, పరిస్థితి నరకంగా ఉందని బందీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘దేశంలోకి అక్రమంగా వలస వచ్చి చిక్కిన పిల్లలు 12000 వరకూ నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారని, వారిలో 10000 మందిని వారి తల్లిదండ్రులే అక్రమంగా తరలించారని, మిగతావారూ తల్లిదండ్రులతో చట్ట విరుద్ధంగా వలస వచ్చి విడిపోయార’ని ట్రంప్ కార్యాలయం తెలిపింది. దేశంలో అక్రమ వలసలను నియంత్రించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రజాస్వామ్య వాదులు దేశానికి సమస్యగా మారారని.. దేశంలోకి అక్రమంగా చొరబడి కొంత మంది చేసే అకృత్యాలు, అరాచకాలు వారికి పట్టడం లేదని విమర్శించారు. దేశ భద్రత గురించి వారు ఆలోచించడం లేదని ట్రంప్ మండిపడ్డారు.