అమెరికా మిత్రదేశాలపై దాడులు తప్పవు
– లాడెన్ కుమారుడు హెచ్చరిక
దుబాయ్,జులై 10(జనంసాక్షి):అమెరికా, దాని మిత్రదేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని బిన్ లాడెన్ కొడుకు హమ్‌జా లాడెన్ హెచ్చరించాడు. తన తండ్రి చావుకు కారణమైన అందరిపైనా దాడులు చేస్తామని తాజాగా విడుదలైన ఓ ఆడియో టేప్‌లో అతను స్పష్టంచేశాడు. వీ ఆర్ ఆల్ ఒసామా పేరుతో ఉన్న 21 నిమిషాల నిడివి కలిగిన ఆ ఆడియో టేపును ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది అల్‌ఖైదా. పాలస్తీనా, ఆఫ్ఘనిస్థాన్, సిరియా, ఇరాక్, యెమెన్, సోమాలియాతోపాటు ఇతర ముస్లిం దేశాల ప్రజలను అమెరికా అణిచివేయడానికి ప్రయత్నిస్తోందని, దానికి తగిన ఫలితం అనుభవించాల్సిందేనని హమ్‌జా హెచ్చరించాడు.లాడెన్ కోసమే కాదు ఇస్లాంను రక్షించడానికి ప్రయత్నిస్తున్న అందరి తరఫున అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని అన్నాడు. 9/11 దాడుల తర్వాత పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో తలదాచుకుంటున్న లాడెన్‌ను 2011లో అమెరికా సైనికులు హతమార్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ అతని కొడుకు హమ్‌జా నేతృత్వంలో అల్‌ఖైదాను మళ్లీ ఒక్కటి చేయాలని ఆ ఉగ్రవాద సంస్థ సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హమ్‌జా ఆడియో టేప్ అమెరికాకు డేంజర్ సిగ్నల్స్‌ను పంపిస్తోంది.