అమెరికా సంచలన నిర్ణయం.. 

మానవ హక్కుల మండలికి గుడ్‌బై
వెనీవా, జూన్‌20(జ‌నం సాక్షి ) : అమెరికా మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి తప్పుకుంది. ఐక్యరాజ్య సమితికి అమెరికా రాయబారిగా ఉన్న నిక్కీ హేలీ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అమెరికా మిత్ర దేశం ఇజ్రాయెల్‌ పట్ల వివక్ష చూపడంతోపాటు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న వాళ్లను ఉపేక్షించడాన్ని నిరసిస్తూ యూఎస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఎన్నో నెలలుగా ట్రంప్‌ ప్రభుత్వం తప్పుకుంటామని హెచ్చరిస్తున్నది. తాజాగా అమెరికా, మెక్సికో సరిహద్దులో వలసదారుల నుంచి పిల్లలను ట్రంప్‌ ప్రభుత్వం వేరు చేస్తుండటంపై యూఎన్‌ మానవ హక్కుల హైకమిషనర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఆ మరుసటి రోజే అమెరికా హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. మండలిలో అమెరికా డిమాండ్‌ చేసిన సంస్కరణలను చేపట్టడం విఫలమవడం కారణంగానే తాము తప్పుకుంటున్నట్లు నిక్కీ హేలీ వెల్లడించారు. మానవ హక్కులను ఉల్లంఘించే వాళ్లే ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారు. వాళ్లే కౌన్సిల్‌కు ఎన్నికవుతున్నారు అని హేలీ విమర్శించారు. ప్రపంచంలో మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న వారు యథేచ్ఛగా పాలిస్తున్నారు. మానవ హక్కులను కాపాడుతున్న దేశాలను బలి పశువులను చేస్తున్నారు అని అమెరికా ఆరోపించింది.
రాజకీయ వివక్షకు ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల మండలి వేదికైందని, ఉల్లంఘిస్తున్న వారినే అందలమెక్కిస్తున్నారని నిక్కీ హేలీ తీవ్రంగా దుయ్యబట్టారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో మొత్తం 47 దేశాలు ఉన్నాయి. మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న వారికి వ్యతిరేకంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ పెన్స్‌ వెల్లడించారు. అయితే అమెరికా నిర్ణయంపై ఐక్యరాజ్య సమితి అసంతృప్తి వ్యక్తంచేసింది.