అమెరికా స్కూల్లో కాల్పులు
టెక్సాస్: అమెరికాలో మరోసారి తుపాకీ సంస్కృతి కోరలు చాచింది. టెక్సాస్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దారుణ ఘటనలో 10మంది విద్యార్థుల వరకు మృతిచెందారు. శాంటా ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులకు తెగబడిన దుండగుడిని అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ మధ్య అమెరికాలో తుపాకీ సంస్కృతిలో భాగంగా జరిగిన దుర్ఘటనలో ఇదొకటి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శాంటా హైస్కూల్లోకి ఓ వ్యక్తి తుపాకీ పట్టుకొని తిరుగుతూ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనతో విద్యార్థులు భయభ్రాంతులకు లోనయ్యారు. శబ్దాలు రావడంతో తరగతి గదుల్లోంచి బయటకు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ప్రాంతమంతా ఖాళీ చేయించి.. పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
ఈ పాఠశాలలో సుమారు 1400 మంది విద్యార్థులు విద్యనభస్యసిస్తున్నట్లు సమాచారం. దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. ‘పాఠశాలలో ఫైర్ డ్రిల్ జరుగుతుందేమో అనుకున్నాం.. కానీ తర్వాత అవి తుపాకీ చప్పుళ్లని తెలిసి విద్యార్థులంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు’ అని పాఠశాలలో పనిచేస్తున్న ఓ టీచర్ చెప్పుకొచ్చారు.