అమ్మవారి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు 

మూలా నక్షత్రంతో భారీగా తరలివచ్చిన భక్తులు
విజయనగరం,అక్టోబర్‌5 (జనంసాక్షి):  మూల నక్షత్రం సందర్భంగా.. విజయనగరం ఎస్‌విఎన్‌ నగర్‌ లో ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శనివారం చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసాలు చేశారు. అక్షరాభ్యాసాల కోసం తల్లిదండ్రులు తమ పిల్లలతో అధిక సంఖ్యలో హాజరయ్యారు. శుక్రవారం రాత్రి నుండే ఆలయానికి సుదూర ప్రాంతలైన ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ ల నుండి ప్రజలు తమ పిల్లలతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు తీవ్ర రద్దీని తలపించాయి. భక్తులతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు కిక్కిరిశాయి. శనివారం ఉదయం 3 గంటల నుండే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి, సరస్వతిమాతగా అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు 4 గంటల నుండి దర్శనం కల్పించారు. ఆలయంలో ఉన్న అక్షరాభ్యాస మండపంలో ముందుగా.. అక్షరాభ్యాసం కోసం టికెట్‌ కొన్నవారికి బ్యాచ్‌ ల వారీగా అక్షరాభ్యాసాలు మొదలుపెట్టారు ఆ కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. ఈ బ్యాచ్‌ లు సాయంత్రం 7 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. తల్లిదండ్రులు తమ చిన్నారుల చేతులు పట్టుకొని బియ్యం, పలక లపై అ, ఆ లు దిద్దించి అక్షరాభ్యాసం చేశారు. అనంతరం వారి తలపై అక్షరాలు దిద్దిన పలకను పెట్టి ఆలయం చుట్టూ నడిపిస్తూ ప్రదక్షిణలు చేయించారు. అనంతరం కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు బరువుకు సమానమైన వస్తువులతో ఆలయంలో తులాభారం తూచి ఆలయానికి సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో టెంట్లు, మంచి నీరు, మజ్జిగ లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండే ఉచిత అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసి భక్తులకి భోజనాన్ని ఏర్పాట్లు చేశారు. ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో క్యూలైన్లు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.