అయోధ్యలో మళ్లీ చిచ్చు
– రహస్యంగా ఇటుకల తరలింపు
న్యూఢిల్లీ,డిసెంబర్21(జనంసాక్షి):సున్నితమైన రామ జన్మభూమి అంశాన్ని వీహెచ్‌పీ నాయకులు మళ్లీ ముందుకు తెచ్చారు. ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్న సంఘ్ పరివార్ శక్తులు… గుడి కడతామంటూ ఆయోధ్యకు ఇటుకలు తరలిస్తున్నారు. వీటికి శిలా పూజలు నిర్వహిస్తూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు సంఘ్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయోధ్యలో అలజడి ప్రారంభమయ్యింది. రామాలయం నిర్మాణానికి ఇటుకలు సేకరించాలని ఈ ఏడాది జూన్‌లో వీహెచ్‌పీ ఇచ్చిన పిలుపును ఆధారంగా చేసుకుని సంఘ్ పరివార్ శక్తులు రెచ్చిపోతున్నాయి. సేకరించిన ఇటుకలను అయోధ్యకు తరలిస్తున్నారు. అయితే వీటిని వివాదాస్పద రామజన్మభూమి స్థలంలోకి కాకుండా…. వీహెచ్‌పీకి అయోధ్యలో ఉన్న ప్రైవేటు స్థలం రామ్ సేవక్ పురంలో ఉంచుతున్నారు. ఇప్పటికే రెండు ట్రక్కులు రాళ్లు చేర్చారు. ఇప్పటికే తరలించిన ఇటుకలను రామ్ జన్మభూమి శిలాన్యాస్ కమిటీ అధ్యక్షుడు మహంత్ నిత్యగోపాల్ దాస్ శిలాపూజ నిర్వహించారు. ఇది కొత్త ఉద్రిక్తతలకు కారణం అవుతోంది.
అయోధ్యకు ఇటుకలు..
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సమయం ఆసన్నమైదంటూ కొన్ని రోజులుగా బీజేపీ, సంఘ్ నేతలు చేస్తున్న ప్రకటనలను కార్యరూపంలోకి తెస్తున్నారనడానికి అయోధ్యకు ఇటుకులు చేర్చడమే నిదర్శనంగా నిలుస్తోంది. ఆలయ నిర్మాణం త్వరలో జరుగుతుందని, ప్రధాని మోడీ ప్రభుత్వం తమకు సంకేతాలు ఇచ్చిందని వీహెచ్‌పీ నాయకులు చెబుతున్నారు. మందిరం నిర్మాణానికి ఇటుకల తరలింపు కొనసాగుతూనే ఉంటుందని సంఘ్ ప్రకటించడంతో…. మళ్లీ ఎటువంటి గొడవలు జరుగుతాయోనని అయోధ్య వాసులు భయపడుతున్నారు. రామ మందిరాన్ని ఎక్కడ నిర్మిస్తారన్న విషయాన్ని సంఘ్ నేతలు చెప్పడంలేదు. వివాదాస్పద స్థలానికి పక్కనే ఉన్న 12 ఎకరాలను ఇందుకోసం కేటాయించాలని కోరుతున్నారు. నిర్మాణానికి 2.25 లక్షల క్యూబిక్ అడుగుల ఇటుకలు అవసరం అవుతాయని అంచనా వేశారు. గతంలోనే 1.25 లక్షల క్యూబిక్ అడుగుల గ్రానైట్ రాళ్లను ఆయోధ్య చేర్చారు. మిగిలిన లక్ష క్యూబిక్ అడుగులు ఇటుకలను ఇప్పుడు తరలిస్తున్నారు.
ఫైజాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం..
అయోధ్యకు ఇటుకల తరలింపుతో యూపీలోని ఫైజాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఇది ఉద్రిక్తతలను దారి తీస్తుండటంతో అయోధ్యలో భద్రత పెంచారు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో… అన్న భయంతో క్షణ క్షణం… పరిస్థితిని సవిూక్షించడంతోటు, పర్యవేక్షిస్తున్నారు. వివాదాస్పద స్థలంలోకి ఇటుకలు తరలించి కుండా… వీహెచ్‌పీకి చెందిన రామ్ సేవక్‌పురంలోకి చేరుస్తున్నారు. వివాదాస్పద రామ జన్మభూమి స్థలంలోకి ఒక్క ఇటుక చేర్చినా… ఉపేక్షిచంబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మత సామరస్యానికి విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమంటున్నారు. అయితే అయోధ్యకు ఇటుకల తరలింపు తరలింపు ప్రారంభమైన తర్వాత… మైనారిటీల్లో ఒకింత అభద్రతాభావం ప్రబలింది. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళనతో ఫైజాబాద్ జిల్లా అధికార యంత్రాంగం ఉంది.
అయోధ్యలో జరుగుతున్న పరిణామాలపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌ను రహస్య నివేదిక కోరింది. రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఇటుకలు సేకరించాలని వీహెచ్‌పీ పిలుపునిచ్చిన ఆర్నెల్ల తర్వాత ఇటుకలతో కూడిన రెండు ట్రక్కులు అయోధ్యకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందో ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్‌ను ప్రభుత్వం రహస్య నివేదిక కోరినట్లు ఐజీ సతీశ్ తెలిపారు. అయోధ్యకు సవిూపంలోని రామసేవక్‌పురంలోని వీహెచ్‌పీ స్థలంలో దించిన ఇటుకలకు రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ ఆధ్వర్యంలో శిలపూజ నిర్వహించినట్లు వీహెచ్‌పీ అధికార ప్రతినిధి శరద్‌శర్మ ఆదివారం చెప్పిన సంగతి తెలిసిందే. రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ నుంచి సంకేతాలు అందినట్లు మహంత్ నృత్యగోపాల్‌దాస్ ఈ సందర్భంలోనే ఆదివారం అన్నారు.ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నివేదిక కోరినట్లు పోలీసు అధికారులు తెలిపారు.