అరవింద్ కేజ్రీవాల్ ఓ నక్సలైట్ : సుబ్రమణియన్ స్వామి

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓ నక్సలైట్ అంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి అభివర్ణించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే, అరవింద్ కేజ్రీవాల్ సంవత్సరం తిరక్కుండానే ముఖ్యమంత్రి పదవిని మళ్లీ వదిలేస్తారని విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ నక్సలైట్ స్వభావం కలిగిన వ్యక్తి అని, ఆయన సహచరులు అందరూ నక్సలైట్ ఉద్యమంతో సంబంధం ఉన్నవారు కావడంతో ప్రభుత్వాన్ని నడపలేరని సుబ్రమణ్య స్వామి ఆరోపించారు.
ఈనెల 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌పై వెలువడుతున్న సర్వేలపై ఢిల్లీ ఓటర్లు ఆమ్ ఆద్మీకే పట్టం కట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి. వీటిపై స్వామి స్పందిస్తూ ఈ ఎన్నికలతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జీరో అయిందన్నారు. కాంగ్రెస్ ఓటర్లంతా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపారని, ఈ ఎన్నికల ఫలితాలు ప్రధాని మోడీపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోమన్నారు. బీజేపీ సీఎం అభ్యర్ధి కిరణ్ బేడీ ఎన్నికల ప్రచారంలో చాలా ఆలస్యంగా చేరారన్నారు.