అరుణాచల్‌ కాంగ్రెస్‌లో అనూహ్యపరిణామాలు

4

– తుకీ రాజీనామా

– సీఎల్పీనేతగా పెమఖండూ

– స్వంతగూటికి అసమ్మతి ఎమ్మెల్యేలు

ఇటానగర్‌,జులై 16(జనంసాక్షి): అరుణాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకుడిగా నబమ్‌ తుకీ శనివారం రాజీనామా చేశారు. కొత్త సీఎల్పీ నేతగా పెమ ఖండూ ఎన్నికయ్యారు. ఉదయం జరిగిన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశానికి 40మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా సొంత గూటికి చేరుకున్నారు. దీంతో అరుణాచల్‌ ప్రదేశ్‌లోకాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమం అయింది.  కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీర్పు అనంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నబమ్‌ టుకీ.. అసెంబ్లీలో బలనిరూపణకు మరింత సమయం కోరుతుండగా.. శనివారం రోజే బలపరీక్ష తప్పదని గవర్నర్‌ తథాగతరాయ్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రంగంఓలకి దిగిన కాంగ్రెస్‌ అక్కడ నేతను మార్చాలని నిర్ణయించింది. దీంతో అధిష్టానం ఆదేశాలతో అరుణాచల్‌ కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నేత నబమ్‌ తుకి తన పదవికి రాజీనామా చేసారు. పేమ ఖండును నూతన కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సీఎల్పీ) నేతగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. దీంతో కొత్త సిఎంగా పేమఖండు బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే అసమ్మతి నేతలు మళ్లీ సొంతగూటికి చేరుకోవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఢోకా లేకుండా పోయింది.