అర్థరాత్రి వారణాసి రోడ్లపై మోడీ బిజిబిజీ
సిఎం యోగితో కలసి కలియ తిరిగిన ప్రధాని
ప్రధాన సమస్యలపై అక్కడిక్కడే ఆరా
వారణాసి,డిసెంబర్14 (జనంసాక్షి ): వారణాసిలో బిజీబిజీగా పర్యటించారు ప్రధాని మోదీ. వారణాసిలో కాశీ విశ్వనాథ కారిడాన్ సందర్భంగా పర్యటించిన ప్రధాని సోమవారం రాత్రి వారణాసిలో కలియ తిరిగారు. అర్థరాత్రి వారణాసి రోడ్లపై తిరుగుతూ కీలక అభివృద్ధి పనుల్ని ఆయన పరిశీలించారు. అలాగే స్థానిక సమస్యలపై ఆరా తీసారు. కాశీ కారిడార్ పనుల్ని ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. దీనికి సంబంధించిన ఫోటోల్ని సోషల్ విూడియాలో షేర్ చేశారు. ఈ పవిత్ర నగరానికి సాధ్యమైనంత ఉత్తమమైన మౌలిక సదుపాయాలను సృష్టించడం మా ప్రయత్నం’ అని ట్వీట్ చేశారు ప్రధాని సోమవారం అర్థరాత్రి బనారస్ రైల్వే స్టేషన్‌ను కూడా తనిఖీ చేశారు. ’రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి అలాగే స్వచ్ఛమైన, ఆధునిక, ప్రయాణీకులకు అనుకూలమైన రైల్వే స్టేషన్‌లను నిర్దారించడానికి కృషి చేస్తున్నాం‘ అని ప్రధాని ట్వీట్ చేశారు. అర్థరాత్రి పర్యటనలో మోడీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. మోడీ రాకతో ఒక్కసారిగా రోడ్లపై కోలాహలం నెలకొంది. జనం మోడీని ఫోటోలు, వీడియోలు తీయడానికి ఉత్సాహం చూపించారు. అంతకుముందు వారణాసిలో కారిడార్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కూలీలను పూలవర్షం కురిపించి సన్మానించి వారితో మెట్లపై కూర్చొని కలిసి ఫొటోలు దిగారు. అనంతరం ప్రధాని మోడీ అక్కడి మత పెద్దలతో సంభాషించారు. వారణాసిలో సోమవారం మధ్యాహ్నం 1.37 నుంచి 1.57 గంటల వరకు 20 నిమిషాల పాటు రేవతీ నక్షత్రం శుభ ముహూర్తంలో కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధాని ప్రారంభించారు. బాబా విశ్వనాథ్‌కు నమస్కారం చేస్తూ మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆయన పవిత్ర గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. గంగానదిలో, కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.