అలంపూర్‌ అబ్రహంకు అనుమానమే..

` ఇంకా వీడని ఉత్కంఠ
` నర్సాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి
` బీఫాం అందజేసిన కేసీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో అభ్యర్థుల ప్రకటనలో, బీ ఫాంల అందజేతలో, ప్రచారంలో ముందున్న భారాస ఇప్పటి వరకు 109 మంది అభ్యర్థులకు బీ ఫాంలు అందజేసినా అలంపూర్‌ స్థానంలపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ తొలివిడత ప్రకటించిన పేర్లలో అలంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే అబ్రహం కూడా ఉన్నారు. తొలివిడతలో ప్రకటించిన అభ్యర్థుల్లో అబ్రహాంకు మినహా మిగిలిన అందరికీ ఇప్పటికే సీఎం కేసీఆర్‌ బీ ఫాంలు అందజేశారు. ఈ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మరో అభ్యర్థికి బీ ఫాం ఇవ్వాలని అధిష్ఠానంపై చల్లా ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు తనకే బీ ఫాం ఇవ్వాలని అబ్రహం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను, మంత్రి హరీశ్‌రావులను కలిసి విన్నవించినట్లుగా తెలిసింది.తొలివిడతలో అభ్యర్థులను ప్రకటించని జనగామ, నర్సాపూర్‌, గోషామహల్‌, నాంపల్లి స్థానాల్లో ఇప్పటికే జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బీ ఫాంను అందించారు. ఇక గోషామహల్‌, నాంపల్లి నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీంతో మొత్తంగా 119 నియోజకవర్గాలకు గాను.. ఇంకా నర్సాపూర్‌, అలంపూర్‌, గోషామహల్‌, నాంపల్లి, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, బహదూర్‌పురా, కార్వాన్‌, మలక్‌పేట, యాకుత్‌పురా.. కలుపుకొని 10 నియోజకవర్గాల్లో అభ్యర్థులకు భారాస పార్టీ తరఫున బీ ఫాంలు అందాల్సి ఉంది.
నర్సాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి
ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పేరును సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. దీంతో ప్రగతి భవన్‌లో సునీతా లక్ష్మారెడ్డికి కేసీఆర్‌ బీ`ఫామ్‌ అందజేశారు. ఎమ్మెల్యే మదన్‌ రెడ్డితో కలిసి సునీత బీ`ఫామ్‌ అందుకున్నారు.కాంగ్రెస్‌ పార్టీ తరపున నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సునీతా లక్ష్మారెడ్డి గెలిచారు. 2009లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మంత్రివర్గంలో చిన్ననీటి వనరుల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రోశయ్య మంత్రివర్గంలో కొనసాగారు. 2010లో కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమం, స్వయం సహాయక సంఘాలు, ఇందిరా క్రాంతి పథం, పింఛన్ల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2004 నుంచి 2009 వరకు శాసనసభ మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా కొనసాగారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సునీతా లక్ష్మారెడ్డి, 2019, ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి నియామకం అయ్యారు.