పహల్గామ్ దాడి: విద్యార్థిగా పాకిస్థాన్ వెళ్లి ఉగ్రవాదిగా తిరిగొచ్చిన ఆదిల్ థోకర్
జమ్ముకశ్మీర్ ( జనంసాక్షి ): జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న ఆదిల్ హుస్సేన్ థోకర్ గురించిన ముఖ్యమైన సంగతులు వెలుగులోకి వచ్చాయి. అనంత్‌నాగ్ జిల్లాకు చెందిన ఇరవై ఏళ్ల ఆదిల్, చిన్న వయసులోనే ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడైనట్లు నిఘా వర్గాలు తెలిపాయి.2018లో విద్యార్థి వీసాపై పాకిస్థాన్‌కు వెళ్లిన ఆదిల్, అక్కడ లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి ఉగ్రవాద సంస్థల్లో శిక్షణ పొందినట్లు సమాచారం. దాదాపు ఎనిమిది నెలల పాటు అజ్ఞాతంలో ఉన్న ఆదిల్, ఆ తర్వాత ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించేందుకే పర్యాటకులు ఎక్కువగా ఉండే పహల్గామ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ 22న ఆదిల్, మరికొందరు ఉగ్రవాదులు బైసరన్ లోయలో పర్యాటకులను చుట్టుముట్టి, ఎం-4, ఏకే-47 రైఫిళ్లతో కాల్పులు జరిపి పారిపోయారు. ఈ దాడి నేపథ్యంలో పోలీసులు ఆదిల్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను విడుదల చేశారు. వారి ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. నిందితుల కోసం అనంత్‌నాగ్, పహల్గామ్ పరిసర అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.