అలుపెరుగని అక్షర చైతన్యం… వైద్యం చేయించుకోలేని ధైన్యం..
చేయూత కోసం సిరిసిల్ల రాజేశ్వరి ఎదురుచూపు.
మంత్రి సాయం కోసం వేడుకుంటున్న కుటుంబ సభ్యులు.
సిరిసిల్ల. అక్టోబర్ 21. (జనం సాక్షి). విధి విసిరిన ముండ్ల కంచెలను దాటుకుని అక్షర చైతన్యమై నిలబడిన సిరిసిల్ల రాజేశ్వరిని కష్టాలు వెన్నంటి వస్తున్నాయి. వైకల్యం జీవితానికి శాపంగా మారిన నిరాశను జీవితం దరిచేరనీయకుండా ఆత్మవిశ్వాసంతో నిలబడిన కవయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి వెంటాడుతున్న అనారోగ్యాన్ని జయించేందుకు ఆర్థికంగా చేయూత లేకపోవడంతో సహాయం కోసం దైన్యంతో ఎదురుచూస్తుంది..
సిరిసిల్ల పట్టణానికి చెందిన సిరిసిల్ల రాజేశ్వరి తెలియని వారు ఉండకపోవచ్చు. నిరుపేద చేనేత 1980 లో జన్మించిన రాజేశ్వరి వైకల్యం జీవితనికి శాపంగా మారింది. చేతులు పని చేయకపోవడంతో పట్టుదలతో కాళ్లతోనే రాయడం నేర్చుకుంది. అట్లా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురు నిలవడం నేర్చుకుంది. తన జీవితంలో సమాజంలో తాను చూసిన ప్రపంచాన్ని అక్షరాల్లో ఒదిగించి కవిత్వం రాయడం మొదలుపెట్టింది. ఆమె జీవితం గురించి క్లుప్తంగా ఆమె మాటల్లో చెప్పాలంటే:”చిరునవ్వులతో బతకాలి ఆత్మ తృప్తితో బతకాలి అందరికోసం బతకాలి అందరిని బతికించాలి”ఇవి సిరిసిల్ల రాజేశ్వరి రాసిన ఒక కవితలోని వాక్యాలు. వైకల్యాన్ని జయించిన సిరిసిల్ల రాజేశ్వరి కవిత్వానికి సుద్దాల ఫౌండేషన్ పురస్కారాన్ని అందించింది. ఆమె జీవిత భద్రత కోసం తగిన చేయుతను అందించింది. జాతీయస్థాయిలో ఎందరికో ఆత్మస్వాసాన్ని అందించిన సిరిసిల్ల రాజేశ్వరి ఇప్పుడు దైన్యస్థితిలో మిగిలింది. గత నెల రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకువెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు తక్షణం ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చికిత్స కోసం 15 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలపడంతో రాజేశ్వరి కుటుంబం దిక్కు తోచని పరిస్థితుల్లో మిగిలింది. కుటుంబo గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో తాము వైద్యం కోసం డబ్బులు ఎట్లా తేచ్చేదంటు నిస్సహాయంగా సహాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తున్నారు.
సంకల్పం ముందు వైకల్యం ఎంత !
దృఢ చిత్తముందు దురదృష్టం ఎంత !
ఎదురీత ముందు విదిరాత ఎంత !
అని నిబ్బరంగా నిలబడ్డ సిరిసిల్ల రాజేశ్వరి వైద్య సహాయం కోసం ఎదురుచూస్తోంది. స్థానిక శాసనసభ్యులు మంత్రి కేటీఆర్ దయచూపితే రాజేశ్వరి ప్రాణo నిలబడుతుందని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాతల సహాయం కోసం కుటుంబం ఎదురుచూస్తోంది. మానవత్వంతో సహా అందించా లనుకునే వారు ప్రస్తుతం రాజేశ్వరి మేనల్లుడు భాస్కర్.9908736574. నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా తమ సహాయాన్ని అందించవచ్చు.