అలుపెరుగని మందకృష్ణ పోరాటం
మహాకూటమికి మద్దతుతో మారనున్న సవిూకరణాలు
దళితుల సమస్యకు పరిష్కారం దక్కగలదన్న ఆశాభావం
హైదరాబాద్,నవంబర్26(జనంసాక్షి): ఎస్సీల్లో వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ ఇప్పుడు కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇవ్వడంతో రాజకీయంగా మార్పు వచ్చేలా ఉంది. తమకు సమస్య పరిస్కారమే ముఖ్యమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గతంలోనే తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం చివరి అంకానికి చేరుకున్న దశలో మాదిగల ఐక్యతను చాటేందుకే పనిచేస్తున్నామని చెప్పారు. దళితుల భవిష్యత్తు కోసమే వర్గీకరణ కోరుతున్నామని, మాలలంతా తమ సోదరులే అని పేర్కొన్నారు. వర్గీకరణను వ్యతిరేకించేవారిని మాత్రమే శత్రువులుగా భావిస్తున్నామన్నారు. మందకృష్ణది ఒంటరిపోరు కాదు. అతడి ఒక్క పిలుపుతో లక్షలాది జనం
స్వచ్ఛందంగా సవిూకృతమవుతారు. 1996 నుంచి దండోరా సభలే అందుకు తార్కాణం. సుశిక్షితులైన సైనికులుగా మాదిగలు, ఆ రోజే సభకు వచ్చినా ఆ రోజే నాయకుడిని చూసినా, నాయకుడి మాటను గౌరవిస్తారు. క్రమ శిక్షణతో ఉంటారు. మిగిలిన ఉద్యమాలతో పోలిస్తే, దండోరా ఉద్యమం అన్నివేల లక్షల మందితో ఉద్యమం చేసినా ఏనాడూ అదుపు తప్పలేదు. హింసకు కారణం కాలేదనే ప్రశంసను పొందింది. మందకృష్ణ నాయకత్వ శక్తికి మాదిగల సంయమన స్వభావానికి ఇది నిదర్శనం. ఒక్కపిలుపుతో లాయర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, కవులు కళాకారులు, అంగవికలురు, ఇలా మద్తు పెరుగుతూ వచ్చింది. రెండు దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ దండోరా వేస్తున్నా ఎస్సీల వర్గీకరణలో ఎందుకనో పాలకులు ముందడుగు వేయడం లేదు. ఓ న్యాయమైన సామాజిక ఉద్యమాన్ని గుర్తించడం లేదు. అలుపెరుగని పోరాట యోధుడిలా మందకృష్ణ చేస్తున్న పోరాటం కేంద్రాన్ని కదిలించలేక పోయింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఒక న్యాయబద్ధమైన సామాజిక అంశంగా గుర్తించాలి. అందుకే దీనికి మద్దతు సర్వత్రా లభించటం కూడా గుర్తించాలి. ఎస్సీ రిజర్వేషన్ అయిన పదిహేను శాతాన్ని ఉపకులాల వారీగా విభజించాలని మాదిగలు ఉద్యమాన్ని భుజాన చేస్తున్న సాగుతున్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించడం లక్ష్యంగా పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ మాదిగల చైతన్య ప్రదర్శన గతంలో ఢిల్లీలో జరిగినప్పుడు అనేక రాజకీయ పక్షాలు మద్దతు పలికాయి. ఇంతకన్నా గొప్ప పోరాటం మరోటి
ఉంటుందని అనుకోవద్దు. ఓ సామాజిక న్యాయం కోసం తలెత్తిన ఉద్యమం దండోరా అని చెప్పడంలో ఎవరికి కూడా అనుమానాలు ఉండరాదు. వర్గీకరణ జరిగితే ఎస్సీల్లో ఉండే 60 ఉపకులాలు ప్రయోజనం పొందుతాయి. తమ తోటి అణగారిన ఎస్సీ కులాలన్నింటికి ప్రయోజనకారిగా ఉండాలని మాదిగలు
కోరుకోవడంలో ఔచిత్యం ఉంది. మిగిలిన 59 కులాలకు కావలసిన హక్కులు పరిరక్షించాలని కోరుకుంటే, ఒక కులానికి ప్రాతినిధ్యం వహించే మాలమహానాడు దళిత ఐక్యతను దండోరా ఉద్యమం దెబ్బతీస్తుందని వ్యతిరేకిస్తూ ఉంది. అయితే ఇందులో ఉన్న పరమార్థాన్ని, సామాజిక న్యాయాన్ని వారు గుర్తించాల్సి ఉంది. సామాజిక న్యాయం కోసం దళితులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉన్నా ఎందుకనో గత రెండు దశాబ్దాలుగా పాలకులు పట్టించు కోవడం లేదు. ఎస్సీల వర్గీకరణ ద్వారా ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేయాలని కోరుకోవడంలో తప్పులేదు. ఎస్సీల్లో మాదిగలకన్నా ఇంకా హీనంగా అనేక జాతులున్నాయి. అంబేడ్కర్ మహాశయుడు అందించిన రిజర్వేషన్లు ఈ వర్గాలకు దక్కడం లేదు. సుప్రీం కోర్టు తీర్పు, ఉషామెహ్రా నివేదిక, సమస్యను తెలుగు ప్రాంతాలను దాటి పార్లమెంటు ప్రాంగణానికి చేర్చాయి. ఆర్టికల్ 341 సవరణ ద్వారా వర్గీకరణ చేయొచ్చని ఉషామెహ్రా నివేదిక సూచించింది. ఇది ఇప్పుడు అమలు కావాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, మేధావులు మద్దతు తెలుపుతున్నారు కనుక కేంద్రం ఓ అడుగు ముందుకేసి వర్గీకరణ జరగడానికి చొరవ తీసుకోవాలి. కొన్ని తరాలుగా అణచివేతకు గురయిన ఉపకులాలను సమాజంలో పౌరులుగా గుర్తించాలంటే వారికి హక్కును పొందే అవకాశం ఇవ్వాలి. దానికి రాజ్యంగ సవరణెళి మార్గం అని గుర్తించాలి. ఇకపోతే రిజర్వేషన్లు పొంది ఉన్నత స్థానాలు అందుకున్న వారు ఇంకా రిజర్వేషన్లు పొందుతూనే ఉన్నారు. దీనివల్ల కూడా ఎస్సీలకు న్యాయం జరగడం లేదు. అవకాశాలు పొంది అత్యున్నత స్థాయికి చేరుకున్న వారికి ఎక్కడో ఒకచోట చెక్ పెట్టకపోతే మిగతా దళితులకు న్యాయం చేయలేం. దళిత రిజర్వేషన్లను ఒక కుటుంబంలో ఎంతమందికి, ఎన్నిసార్లు అన్న విధానం రావాల్సి ఉంది. ఇందుకోసం ముందుగా సామాజిక కోణంలో అధ్యయనం చేయాలి. ఇదో రకమైన సమస్యగా ఉత్పన్నం కాకుండా ప్రస్తుత వర్గీకరణ సమస్యను కూడా చర్చి చేయాల్సి ఉంది. ఇదే సందర్భంలో అందరూ కలసి
కొందరే రిజర్వేషన్లు అనుభవించే విధానాన్ని వ్యతిరేకించాలి. కొన్ని కుటుంబాల వారే రాజకీయంగా ఎందుకు ఎదగాలి అన్నది ఆలోచన చేయాలి. వరుసబెట్టి కొన్ని కుటుంబాలే రిజర్వేషన్లు పొందకుండా నిర్ణీ కాలపరిమితి విధించాలి.ఇలా చదువు ఉద్యోగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లపైనా ఆంక్షలు కోరుకోవాలి. మాల మేధావులు సైతం దానిలోని న్యాయసమ్మత మైన అంశాన్ని అర్థం చేసుకుని మద్దతు ఇస్తే సమస్యకు పరిష్కారం దక్కగలదు. రాజకీయ పక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కన పెట్టి తక్షణం ఈ సమస్యను చర్చించాల్సిఉంది.నాయకత్వ స్థానంలో మంద కృష్ణ చేస్తున్న పోరాటం ద్వితీయ శ్రేణి నాయకులు, తృతీయ శ్రేణి నాయకులతో బలోపేతంగా ప్రదర్శితం కావాలి. భవిష్యత్‌కు సమర్థులైన ఉద్యమ నాయకులను తీర్చిదిద్ది మరిన్ని సేవలను పొందాల్సిన బాధ్యత అవసరం మందకృష్ణకు ఎమ్మార్పీయస్‌కు ఉంది. అంబేడ్కర్‌కు దళితులకు రాజ్యాధికారం అంతిమ లక్ష్యం అన్నాడు.