అవసరమైతే జైలుకు

3

– బెయిల్‌ పిటీషన్‌ పెట్టుకోరాదని సోనియా, రాహుల్‌ నిర్ణయం

న్యూఢిల్లీ,డిసెంబర్‌18(జనంసాక్షి): ఉభయ సభలను కుదిపేసిన నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో అవసరమైతే జైలుకు వెళ్తామని, కానీ బెయిల్‌ పిటీషన్‌ పెట్టుకోబోమని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో విచారణకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. వచ్చే శనివారం ట్రయల్‌ కోర్ట్‌ ముందు హాజరైనప్పుడు వీరు బెయిల్‌ కోసం అర్జీ పెట్టుకోకపోవచ్చని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి . తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైతే జైలుకు కూడా వెళ్లేందుకు సోనియా, రాహుల్‌ సిద్ధపడుతారని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి.

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు వివాదాన్ని కాంగ్రెస్‌ రాజకీయ అస్త్రంగా….

కాంగ్రెస్‌పై కక్ష తీర్చుకునేందుకే మోడీ ప్రభుత్వం నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో అధినేత్రి సోనియాను, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఇరికించి వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో గందరగోళం సృష్టించిన నేషనల్‌ హెరాల్డ్‌ కేసు వివాదాన్ని కాంగ్రెస్‌ రాజకీయ అస్త్రంగా మార్చుకునేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా అధికార బీజేపీ తమ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసులు బనాయించారని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే కేసులో తమ నిర్దోషిత్వం నిరూపించుకునేందుకు ఉపాధ్యక్షుడు రాహుల్‌, అధినేత్రి సోనియా ఇరువురు ట్రయల్‌ కోర్ట్‌ ముందు హాజరైనప్పుడు బెయిల్‌ కోసం అర్జీ పెట్టుకోవడం లేదని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. న్యాయ పోరాటం చేసేందుకే సిద్ధమని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా వచ్చే శనివారం కాంగ్రెస్‌ అధిష్టానం తమ బలాన్ని ప్రదర్శించుకునేందుకు పాటియాలా హౌజ్‌ కోర్ట్‌ ఎదుట యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలతో పెద్ద ఎత్తున ప్రదర్శన కూడా ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. ఈ మేరకు మోడీ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా పార్టీ అగ్రనేతలు, ఎంపీలు అందరికీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి హుటాహుటిన రమ్మని పిలుపు అందించింది. సోనియా, రాహుల్‌ కోర్టుకు హాజరయ్యే రోజు పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించాలని పార్టీ ప్లాన్‌ చేస్తోంది. మరోవైపు తమపై వచ్చిన అపవాదును చెరిపివేసుకోవడంతో పాటు, బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాహుల్‌, సోనియా జైలుకు వెళ్లేందుకు సైతం వెనుకాడే అవకాశం లేదని సన్నిహిత వర్గాల సమాచారం. కాగా 1977 సాధారణ ఎన్నికల్లో ఇందిరా ఘోరపరాజయం చవిచూసింది. అంతే కాదు జైలు పాలయ్యారు. ఇందిరాతో పాటు సంజయ్‌ గాంధీ సైతం జైలులో ఉండి పోరాటం చేశారు. సరిగ్గా రెండేళ్లయినా తిరగ్గ ముందే 1980లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో ఇందిరా భారీ విజయం నమోదు చేసింది. సరిగ్గా ఇదే ఫార్ములాను సోనియా, రాహుల్‌లు వాడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.